Election Commission: ఏపీలో ఓటర్లకు వీటి పంపిణీకి తొలి ప్రాధాన్యం.. ఈసీ కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే శాసనసభ, లోక్ సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఆయా కేంద్రాల్లో వసతుల కల్పన, భద్రత ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే శాసనసభ, లోక్ సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఆయా కేంద్రాల్లో వసతుల కల్పన, భద్రత ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోసారి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈఓ మీనా అదనపు సీఈవోలు కోటేశ్వరరావు, హరేందిర ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులను పూర్తి స్థాయిలో భాగస్వామ్యులను చేసేందుకు అవసరమైన వర్క్ షాప్‌లను ఈ నెల 10 లోగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణలో ఎటు వంటి ఆరోపణలకు తావు లేకుండా ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు వీరి సహకారం, భాగస్వామ్యం ఎంతో అవసరమని.. ఎన్నికల షెడ్యూలు ఖరారు కాకముందే, ఈ వర్క్ షాపులను నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితా, కొత్తగా ఓట్ల నమోదు, జాబితాలో మార్పులు చేర్పులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రణ పూర్తి అయిన వెంటనే జిల్లా ఎన్నికల అధికారులకు అందుతున్నాయని.. అయితే వీటి పంపిణీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండింగ్ ఫార్ములను పరిష్కరించడములో ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాలని, అందుకు తగ్గట్టుగా రికార్డులను నిర్వహించని ఈఆర్ఓలపై చర్యలు తీసుకుంటామని మీనా చెప్పారు. ఈఆర్ఓలు సరిగా రికార్డులు నిర్వహిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారులు ర్యాండమ్‌గా చెక్ చేస్తూ వుండాలన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి..
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు.. ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ ఆధారంగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఆయా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారులు తప్పని సరిగా సందర్శిస్తూ ఉండాలని.. స్థానికులతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఎన్నికల ప్రక్రియపై సరైన విశ్వాసాన్ని నెలకొల్పాలన్నారు. మీడియా సెల్, సోషల్ మీడియా సెల్, కంట్రోల్ రూమ్‌లను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియా సెల్లో నోడల్ అధికారి నియామకంతో పరిమితం కాకుండా సోషల్ మీడియా నిర్వహణపై నిపుణులైన వారిని కనీసం ముగ్గురుని నియమించి, పలు రకాలైన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. ప్రత్యేకంగా స్టాండర్డు ఆపరేషన్ ప్రొసీజర్‌ను రూపొందించుకుని కంట్రోల్ రూమ్‌ను నిర్వహించాలన్నారు. కంప్లైంట్ మేనేజ్మెంట్, రిపోర్టు మేనేజ్మెంట్, పోల్ డే మేనేజ్మెంట్ అప్లికేషన్లను రూపొందించడం జరిగిందని, వాటిని సక్రమంగా వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అందరూ సరైన అవగాహన పెంచుకోవాలన్నారు సీఈవో మీనా.. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎన్నికలను నిర్వహించే విధంగా అప్డేటెడ్ జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళికలు రూపొందించి ఈ నెల 10 వ తేదీలోపు తనకు అందజేయాలన్నారు. అదే విధంగా ఫిర్యాదులు, ప్రతికూల వార్తల పరిష్కారం, పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన వంటి అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








