AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: ఈ నియోజకవర్గంలో ఆయనకు టిక్కెట్ ఇస్తే రణరంగమే అంటూ హెచ్చరికలు..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు, సొంత పార్టీలోనూ అసమ్మతి సెగలు.. ఎప్పుడూ ఏదో విధంగా చర్చ జరుగుతూనే ఉంటాయి. కొంతకాలంగా ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో గందరగోళం కొనసాగుతుంది. పార్టీలో ఉన్న విభేదాలు మరింత ముదిరాయి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయింది.

TDP: ఈ నియోజకవర్గంలో ఆయనకు టిక్కెట్ ఇస్తే రణరంగమే అంటూ హెచ్చరికలు..
Mailavaram Politics
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Mar 02, 2024 | 7:59 PM

Share

ఎన్టీఆర్ జిల్లా మైలవరం రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు, సొంత పార్టీలోనూ అసమ్మతి సెగలు.. ఎప్పుడూ ఏదో విధంగా చర్చ జరుగుతూనే ఉంటాయి. కొంతకాలంగా ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో గందరగోళం కొనసాగుతుంది. పార్టీలో ఉన్న విభేదాలు మరింత ముదిరాయి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయింది. పార్టీలోకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని వర్గాలు. అయితే చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో గ్రూపు తగాదాలు తారా స్థాయికి చేరాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతారని తెలిసినప్పటినుంచే ఆ పార్టీ క్యాడర్ మూడు వర్గాలుగా డివైడ్ అయిపోయింది.

వసంత కృష్ణ ప్రసాద్‎తో పాటు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు వర్గాలుగా తెలుగుదేశం పార్టీ కేడర్ చీలిపోయింది. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి రావడాన్ని దేవినేని ఉమా, బొమ్మసాని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితమే దేవినేని ఉమాను చంద్రబాబు ఉండవల్లి నివాసానికి పిలిచి మాట్లాడారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేరుతున్న విషయం దేవినేని ఉమాకు చంద్రబాబు తెలిపారు. అప్పటినుంచి దేవినేని ఉమా మౌనంగా ఉన్నారు. చంద్రబాబు మాటే తనకు శిరోధారియమని… తాను చంద్రబాబు కుటుంబంలో సభ్యుడిని దేవినేని ఉమ చెప్పుకొచ్చారు.. అయితే బొమ్మసాని సుబ్బారావు మాత్రం మైలవరం టిక్కెట్టు తనకు ఇవ్వాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగానే హైదరాబాద్ వెళ్లి చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఈయనతో పాటు మరి కొంతమంది వైసిపి ముఖ్య నేతలు కూడా పసుపు కండువా కప్పుకున్నారు.

తెలుగు తమ్ముళ్లలో బయటపడ్డ అసమ్మతి..

కృష్ణ ప్రసాద్ చేరికకు కొన్ని గంటల ముందే మాజీ మంత్రి దేవినేని ఉమా శంఖారావం పేరుతో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. గొల్లపూడిలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో ఉమా అనుచరులు వసంత తీరుపై మండిపడ్డారు. ఐదేళ్లుగా తమను ఇబ్బంది పెట్టిన వసంత కృష్ణ ప్రసాద్‎కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పారు. అదే గనక జరిగితే మైలవరం నియోజకవర్గం రణరంగంగా మారిపోతుందని హెచ్చరించారు. ఉమా సమక్షంలోనే ఇదంతా జరిగింది. అనుచరుల వ్యాఖ్యలతో దేవినేని ఉమా భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు బొమ్మసాని సుబ్బారావు ఇప్పటికే వసంతను వ్యతిరేకిస్తూ రెండుసార్లు అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. రేపు బల నిరూపణ కోసం భారీగా కార్యకర్తలతో చంద్రబాబు నివాసానికి వెళ్లి టిక్కెట్టును ఇవ్వాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్‎కు సహకరించాలని ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు రంగంలోకి దిగారు బొమ్మసాని ఇంటికి వెళ్లి మరీ మాట్లాడినా ఆయన ఒప్పుకోలేదు. కృష్ణ ప్రసాద్ మైలవరం కాకుండా వేరే నియోజకవర్గంలో పోటీ చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

వసంత కృష్ణ ప్రసాద్‎తో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన వైసిపి ముఖ్య నేతలు టిడిపి తీర్దం పుచ్చుకున్నారు. తన రాకపై నియోజకవర్గంలో ఎదురవుతున్న వ్యతిరేకతపై చంద్రబాబు ఇంటి వద్ద వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు. చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలన్నదే తన కోరిక అన్నారు. తనకు ఎక్కడ సీటు ఇచ్చినా పోటికి సిద్ధమేనని సీటు ఇవ్వకపోయినా పర్వాలేదని అన్నారు. దేవినేని ఉమాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాననీ వసంత చెప్పారు. అన్ని పార్టీలు సర్వేలు కూడా తనకే అనుకూలంగా ఉన్నాయని కృష్ణ ప్రసాద్ తెలిపారు. మైలవరం టిక్కెట్టు నాకే ఇస్తానని వైసీపీ చెప్పినా.. అభివృద్ధి జరగడంలేదని కారణంతోనే పార్టీ మారానని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.

నిన్న మొన్నటి వరకు వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా మధ్య మాటల యుద్ధం రేగింది. ఒకానొక దశలో కుటుంబ సభ్యులపై సైతం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు నేతలు ఒకే పార్టీ గుర్తుకు చేరడం, తాజా పరిణామాలు టిడిపి క్యాడర్‎ను గందరగోళానికి గురి చేస్తున్నాయి. పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలతో చంద్రబాబు మైలవరం టిక్కెట్‎ను వసంత కృష్ణ ప్రసాద్ కే ఇస్తారా లేక మరోసారి పరిశీలిస్తారా అనే చర్చ కూడా మొదలైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..