పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడ్డారు.. బైక్ మాయం.. ! అసలు విషయం ఏంటో తెలిస్తే..
అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో దొంగతనం కేసులో పట్టుబడిన ద్విచక్ర వాహనం మాయమైంది. మూడు నెలలైనా బైక్ ఆచూకీ లేదు, పోలీసులు మౌనంగా ఉన్నారు. పోలీసులు దొంగకు సహకరించారా లేదా విక్రయించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల జోక్యం, సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇళ్ళలో దొంగలు పడితే పోలీసులను ఆశ్రయిస్తాం .. పోలీస్ స్టేషన్లో వస్తువులు మాయమైతే వారు ఎవరికి చెప్పికోవాలి… ఇంతకీ అక్కడ ఉన్న పోలీసులే దొంగలా లేక కావాలని దొంగకు సహకరించారా …? దొంగతనానికి వాడిన బైక్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తే అక్కడ ఆబైక్ మాయమైంది… ఆ బైక్ పోలీసులు ఎవరైనా అమ్మెశారా.. లేక దొంగకే సహకరించి అతనికి ఆ బైక్ ను ఇచ్చేశారా..? ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం సంబేపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన పోలీసుల తీరును ప్రశ్నిస్తుంది.
అన్నమయ్య జిల్లా సమ్మెపల్లి మండల పరిధిలో ఉంది నారాయణ రెడ్డి గారి పల్లె. ఇక్కడి స్థానిక రంగుల నాగేశ్వర అనే వ్యక్తి ఇంట్లో ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన తెల్లవారుజామున ఓ దొంగ ప్రవేశించాడు. ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. దాంతో ఇంటి యజమాని నాగేశ్వర అతనిని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తి తాను వేసుకుని వచ్చిన టూవీలర్ వాహనాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. దీంతో వెంటనే సంబేపల్లి పోలీసులకు సమాచారం తెలియజేశాడు. ఆ బైక్ ను పోలీసులకు అప్పజెప్పిన నాగేశ్వర స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
ఇంతవరకు బాగానే ఉంది … కానీ, పోలీసులకు అప్పజెప్పిన ఆ బైక్ ఏమైందో ఆ కేసు విషయం ఏమైందో ఇప్పటికీ తేలలేదు.. పోలీస్ స్టేషన్లో ఉన్న బైక్ మాత్రం మాయమైంది .. మూడు నెలలైనా దొంగ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీనిపై పోలీసులను అడిగితే వారి నుంచి వచ్చే సమాధానాలు మాత్రం మౌనం. అసలు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ప్రక్రియ మొదలు కాలేదని ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ రికార్డులలో కూడా ఆ టూవీలర్ వివరాలు లేవన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన బైక్ ఇప్పుడు ఎక్కడ ఉంది..? అనేది స్థానికంగా జరుగుతున్నచర్చ… పోలీసుల పనితీరుపై ఇది ప్రశ్నార్థకంగా మారింది..
పోలీసులు దొంగకు సహకరించి ఆ బైకును ఇచ్చేసారని ఒక చర్చ నడుస్తుంటే, మరోవైపు పోలీసులు దానిని ఎవరికైనా అమ్మేసి ఉంటారు.. అనే చర్చ కూడా నడుస్తుంది.. ఇంతకీ పోలీస్ స్టేషన్లో మాయమైన బైక్ ఎక్కడ అనేదానిపై మాత్రం ఎవరీకి క్లారిటీ లేదు. ఇప్పటికైనా ఈ సంఘటనపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పోలీస్ స్టేషన్లో ఉన్న టూవీలర్ ఏమైంది..? అనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








