ఊపిరి ఉన్నంతవరకు ఊచలే.. జీవితాంతం ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులో ఉంచే ప్లాన్..!
ఊపిరి ఉన్నంతవరకు ఊచలే.. చంపరు, కానీ చావును పరిచయం చేస్తారు. టార్చర్ పెట్టరు, కానీ చీకటి గదుల్లోనే నరకం చూపిస్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇదే జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు జీవితాంతం ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులో ఉంచే ప్లాన్ సిద్ధం చేసింది.

ఊపిరి ఉన్నంతవరకు ఊచలే.. చంపరు, కానీ చావును పరిచయం చేస్తారు. టార్చర్ పెట్టరు, కానీ చీకటి గదుల్లోనే నరకం చూపిస్తారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఇదే జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు జీవితాంతం ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులో ఉంచే ప్లాన్ సిద్ధం చేసింది.
తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 17ఏళ్ల జైలుశిక్ష పడింది. ఇమ్రాన్ తోపాటు ఆయన భార్య బుష్రా బీబీకీ అదే శిక్ష వేసింది కోర్టు. ప్రస్తుతం ఇమ్రాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఆ జైలులోనే న్యాయమూర్తి అర్జుమంద్ విచారణ జరిపి.. ఇమ్రాన్ దంపతులకు 17ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో పాటు ఒక్కొక్కరికీ 1.64 కోట్ల పాకిస్థానీ రుపాయలు జరిమానా కూడా విధించారు. ఇమ్రాన్ వయసు, ఆయన భార్య మహిళ అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ తీర్పు ఇచ్చినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. పాకిస్తాన్ కోర్టు తీర్పును తాము హైకోర్టులో సవాల్ చేస్తామని ఇమ్రాన్ తరఫు న్యాయవాది తెలిపారు.
తోషాఖానా అనేది పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక విభాగం. నాయకులు, ప్రభుత్వాధికారులు విదేశీ పర్యటనలు, అధికారిక కార్యక్రమాల్లో వచ్చిన బహుమతులు తోషాఖానాలో జమ చేయాలి. కానుకలను వ్యక్తిగత ఆస్తిగా ఉంచుకునే ప్రధానితో సహా ఎవరికీ హక్కు లేదు. ఒకవేళ కానుకలు కావాలనుకుంటే నిబంధనల ప్రకారం, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాలి. లేకపోతే పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించాలి. ఇమ్రాన్‌ఖాన్ తనకు బహుమతిగా వచ్చిన లగ్జరీ గడియారాలను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశాడన్నది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా సౌదీ యువరాజు ఇచ్చిన ఖరీదైన వాచీలు ఇమ్రాన్‌ఖాన్ తీసుకున్నారని అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పుడీ కేసుపైనే ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు శిక్షపడింది.
అయితే ఇదంతా రాజకీయ కక్షతోనే కేసుల ఉచ్చు బిగించారని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు అంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ పాకిస్తాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో ఒకరని, జైల్లో ఉన్నా ఆయన పేరు రాజకీయంగా మార్మోగుతూనే ఉందంటున్నారు. యువతలో ఇమ్రాన్ ప్రభావం కొనసాగుతుండటం అధికార వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే ఆయనపై వరుసగా కేసులు విధించి, శిక్షలు పడేలా చేస్తున్నారంటున్నారు ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్. వారం కిందట ఇమ్రాన్ ఖాన్ కుమారులు కూడా తమ తండ్రిని జీవితాంతం జైల్లోనే పెడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తోషాఖానా కేసే కాదు, ఇమ్రాన్‌ఖాన్‌పై డజన్ల సంఖ్యలో కేసులు ఉన్నాయి..
ఇమ్రాన్‌ఫై నమోదు చేయబడ్డ కేసుల్లో అక్రమ ఆస్తుల వ్యవహారం, అధికార దుర్వినియోగం వంటి కేసులు ప్రధానమైనవి. ప్రభుత్వ నమ్మకానికి ద్రోహం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. ఉగ్రవాద నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, సీక్రెట్‌గా ఉంచాల్సిన దౌత్య పత్రాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలతో ‘సైఫర్ కేసు’ కూడా ఫైల్ అయింది. కొన్ని కేసుల్లో మొత్తంగా 30 – 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. అన్ని కేసుల్లో శిక్షలు పడితే జీవితకాలం జైలులోనే ఉండాల్సిందే..!
ఇదిలావుంటే, ఇమ్రాన్‌ఖాన్ తనపై నమోదైన కేసులన్నీ ఖండిస్తూ వస్తున్నారు. తనను పూర్తిగా రాజకీయంగా అణిచి వేసేందుకు జరిగిన కుట్రలో భాగమే అంటున్నారు. గతంలోనూ అనేకమంది రాజకీయ నేతలు కోర్టుల ద్వారా శిక్షలు ఎదుర్కొన్న ఉదాహరణలు ఉన్నాయి. అయితే, ఇమ్రాన్ ఖాన్ విషయంలో కేసుల సంఖ్య, తీవ్రత, సమయపాలన అన్నీ కలిసి చూస్తే అంతా ప్లాన్డ్‌గా జరుగుతున్నదేనని ఇమ్రాన్‌ఖాన్ మద్దతు దారులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
