Andhra Pradesh: ముస్లింలకు ఇచ్చి కాపులకు ఎందుకివ్వరు.. రిజర్వేషన్లపై సోము వీర్రాజు సంచలన కామెంట్స్..
Andhra Pradesh: కాపు రిజర్వేషన్ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కాపులకు..
Andhra Pradesh: కాపు రిజర్వేషన్ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కాపులకు ఎందుకు ఇవ్వలేదని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారాయన. ముస్లింలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాపులను ఎందుకు తీసుకోలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో జీవీఎల్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని పేర్కొన్నారు. ముస్లింలకు రాష్ట్రంలో ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారని, అదే విధంగా కాపులకు కూడా ఇవ్వాలని జీవీఎల్ ప్రస్తావించారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ముస్లింలు అంటే ప్రేమ.. కాపులంటే ద్వేషమా? అని ప్రశ్నించారు వీర్రాజు. వారికి ఇచ్చినప్పుడు.. కాపులకు ఎందుకు ఇవ్వకూడదని నిలదీశారు.
ఈ నెల 17వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎపి లో పర్యటించనున్నారని చెప్పిన ఆయన.. దేశ వ్యాప్తంగా 51ప్రాజెక్టులలో 21జాతీయ రహదారులు ప్రారంభిస్తారని చెప్పారు. 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. వీటికి రూ. 21,500,58 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 64వేల కొట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని పార్లమెంటు సాక్షిగా చెప్పారని వీర్రాజు గుర్తు చేశారు. ఇక దేశ వ్యాప్తంగా 25వేల కిలో మీటర్లు జాతీయ రహదారులను విస్తరించనున్నారని చెప్పారు. ఇందులో అధిక ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడిగి తీసుకోవాలన్నారు. టూరిజం వల్ల అనేక మందికి ఉపాధితో పాటు భూముల విలువ పెరిగిందిన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, లంబసింగి లను కలుపుతూ అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు వీర్రాజు. రూ. 689 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. జాతీయ రహదారి నిర్మాణాలకు పునరావాసం, బాధితులకు నష్ట పరిహారం ఇస్తున్నామని చెప్పారు. దేవరపల్లి, కొవ్వూరు సెక్షన్‌కి రూ. 2,676 కోట్లు విడుదల చేయడం జరిగిందని వీర్రాజు వెల్లడించారు. రూ. 4,793 కోట్లతో రాజమండ్రి, విశాఖ వైపు మరో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టారని పేర్కొన్నారు. ఇలా ఏపీలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు.
అలాగే, నేచర్ క్యూర్ హాస్పటల్ హైదరాబాద్‌లో ఉందన్న వీర్రాజు.. 25 ఎకరాలను కేటాయించి ఏపీలోనూ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్నారు. గన్నవరం మండలంలో ఈ ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. సామర్లకోటలో సెంట్రల్ ప్లాంటేషన్ కార్పొరేషన్ నిర్మాణానికి గతంలో అడిగారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ రెండు ప్రాజెక్టులకు ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు సోము వీర్రాజు. ఆ స్థలాలను జగనన్న ఇళ్లకు కేటాయించారని పేర్కొన్నారు. ఈ చర్యతో అభివృద్ధి నిరోధకులుగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వీర్రాజు విమర్శలు గుప్పించారు. కేంద్రం ఆమోదం తెలిపాక ఇచ్చిన స్థలాలని వెనక్కి తీసుకుంటారా? అని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని చెప్పారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. కేంద్రం ప్రాజెక్టులు పెడతానన్నప్పటికీ వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. ఇక కేంద్ర హోంశాఖ విడుదల చేసిన లేఖ వివాదంపై సోమువీర్రాజు తనదైన శైలిలో స్పందించారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం అని, 17వ తేదీన సమావేశంలో ఏపీ, తెలంగాణ ఆస్తుల అంశంపై చర్చ జరుగుతుందన్నారు. తెలంగాణకు సంబంధం లేని అంశం కాబట్టే అది తొలగించారని వివరించారు. హోదాపై ప్రత్యేక సమావేశం పెట్టి చర్చించాలన్నారు. గత ప్రభుత్వం కొన్ని అంశాలలో పెట్టుబడులు తీసుకున్నారని, కేంద్రం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి నిధులు ఇచ్చిందని వీర్రాజు గుర్తు చేశారు.
Also read:
Bird Walk Festival: కవ్వాల్ జంగిల్‌లో అందాల పక్షుల పండుగ.. పులుల అడ్డాలో పక్షి ప్రేమికుల సందడి
Calcium Deficiency: కాల్షియం లేకపోతే చాలా ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్..
Goa Elections 2022: గోవాలో ఒకే దశలో రేపే పోలింగ్.. బరిలో 301 మంది అభ్యర్థులు