రైలులో రెచ్చిపోయిన బీహార్ గ్యాంగ్.. ఏకంగా రైల్వే స్పెషల్ స్క్వాడ్ టికెట్ కలెక్టర్‌పైనే దౌర్జన్యం.. ట్విస్ట్ ఏంటంటే..
Ongole: ఆ టికెట్ కలెక్టర్ తన సహచరులుకు సమాచారం అందించడంతో బీహార్‌కు చెందిన నలుగురిని పట్టుకున్నారు... మిగిలిన వారు పరారయ్యారు... పట్టుకున్న నలుగురిని రైల్వే పోలీసులకు అప్పగిస్తే అక్కడ కూడా టిటిఇలకు ఓ రైల్వే కానిస్టేబుల్‌కు చుక్కలు చూపించారు.. అర్ధరాత్రి ఈ మద్దెల గోల ఏందంటూ టిటిఇలపై చేయి చేసుకున్నాడు... దీంతో వ్యవహారం టిటిఇ వర్సెస్ రైల్వే పోలీస్ అన్నట్టుగా మారింది.
ఒంగోలు, ఆగస్టు 18: సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ రైలులో బీహార్ గ్యాంగ్ రెచ్చిపోయారు… ఏకంగా రైల్వే స్పెషల్ స్క్వాడ్ టికెట్ కలెక్టర్‌పై దౌర్జన్యం చేసి 27 వేల నగదు లాక్కున్నారు… పదిమంది వరకు ఉన్న బీహార్‌కు చెందిన యువకులను ప్రశ్నించిన టికెట్ కలెక్టర్‌ను రైల్లో నుంచి తోసేస్తామని బెదిరించారు… దీంతో ఏం చేయలేని స్థితిలో ఆ టికెట్ కలెక్టర్ తన సహచరులుకు సమాచారం అందించడంతో బీహార్‌కు చెందిన నలుగురిని పట్టుకున్నారు… మిగిలిన వారు పరారయ్యారు… పట్టుకున్న నలుగురిని రైల్వే పోలీసులకు అప్పగిస్తే అక్కడ కూడా టిటిఇలకు ఓ రైల్వే కానిస్టేబుల్‌కు చుక్కలు చూపించారు.. అర్ధరాత్రి ఈ మద్దెల గోల ఏందంటూ టిటిఇలపై చేయి చేసుకున్నాడు… దీంతో వ్యవహారం టిటిఇ వర్సెస్ రైల్వే పోలీస్ అన్నట్టుగా మారింది.
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైల్లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది… బెంగుళూరు నుంచి బీహార్‌లోని పాటలీపుత్ర జంక్షన్‌కు వెళ్ళే ఈ ఎక్స్‌ప్రెస్ రైల్లో నెల్లూరు – గూడూరు మధ్యలో ఈ రైలులో ప్రయాణిస్తున్న బీహార్ కి చెందిన 10 మంది గ్యాంగ్ రైల్వే స్పెషల్ స్క్వాడ్ టికెట్ కలెక్టర్ సుధీర్ పై దాడి చేశారు… టికెట్ చెకింగ్ చేస్తున్న సమయంలో గ్యాంగ్ సభ్యులు టికెట్ కలెక్టర్ సుధీర్ పై గొడవకు దిగి దాడి చేశారు… సుధీర్ దగ్గర ఉన్న 27 వేల రూపాయల నగదును లాక్కొన్నారు… ఆ సమయంలో ఎదురు తిరిగిన టికెట్ కలెక్టర్ సుధీర్‌ను రైలు నుండి క్రిందకు తోసే ప్రయత్నం చేశారు… దీంతో భయంతో వారి నుంచి తప్పించుకున్న సుధీర్ నెల్లూరులో రైలులో నుంచి దిగి ఒంగోలులోని తోటి ఉద్యోగులకు సమాచారం అందించి వాళ్లని పట్టుకోమని కోరారు…
టికెట్ కలెక్టర్ సుధీర్ ఇచ్చిన సమాచారంతో ఒంగోలులో కాపుకాసిన రైల్వే ఉద్యోగులు రైలు ఒంగోలులో ఆపి బీహార్ గ్యాంగ్‌కు చెందిన నలుగురిని పట్టుకున్నారు… మిగిలిన ఆరుగురు పరారయ్యారు… తాము పట్టుకున్న బీహారీ గ్యాంగ్ సభ్యులను ఒంగోలు జిఆర్‌పి పోలీసులకు అప్పగించారు… పోలీసు స్టేషన్ లో బీహార్ గ్యాంగ్‌కు చెందిన వారిని రైల్వే ఉద్యోగులు పశ్నించారు… వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ రైల్వే ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు… మీరు విచారిస్తే మేమెందుకు ఇక్కడ అంటూ బూతు పదాలు లంకించుకున్నాడు… అదేంటయ్యా నా మీద దాడి చేశాడు… డబ్బులు లాక్కున్నాడు… ఆ డబ్బులు ఎక్కడున్నాయని అడుగుతున్నాను అంటూ టిటిఇ సుధీర్ మాట్లాడుతున్న సమయంలో కానిస్టేబుల్ శ్రీకాంత్ తనపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తున్నారు… అడ్డువచ్చిన మరో ఇద్దరు టిటిఇలపై కూడా కానిస్టేబుల్ శ్రీకాంత్ చేయిచేసుకున్నాడని చెబుతున్నారు…
రైల్లో తమపై దాడి చేసిన బీహార్ గ్యాంగ్ సభ్యులను పట్టుకుని జిఆర్‌పి పోలీసులకు అప్పగిస్తే తమపైనే పోలీసులు దౌర్జన్యం చేయడంతో టిటిఇలు కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై జిఆర్‌పి పోలీస్ సిఐకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు… అయితే ఈ వ్యవహారంపై ఇటు రైల్వే టిటిఇలు, అటు రైల్వే పోలీసులు మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారని తెలిసింది.
ఇదిలా ఉంటే.. గతంలో పలు రైళ్లలోనూ ఇలాంటి ఘటనలే అనేకం జరిగాయి. ఇటీవల వారం రోజుల క్రితమే రెండు వేర్వేరు రైళ్లలో జరిగిన దోపిడీ సంఘటనలు సంచలనం సృష్టించాయి. నెల్లూరు జిల్లా జిల్లా ఉలవపాడు – తెట్టు మధ్య రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నైకు వెళ్లే హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎస్2, ఎస్4, ఎస్5, ఎస్6, ఎస్7, ఎస్8 బోగీల్లో దొంగలు పడ్డారని ప్రయాణికులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఎస్1, ఎస్2, బోగీల్లో కూడా దోపిడీ జరిగింది. దోపిడీ అర్ధరాత్రి జరిగిందని ప్రయాణికులు కావలిలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండు ట్రైన్లలో కలిపి ముగ్గురు మహిళల నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారని ఫిర్యాదు చేశారు. ఆరుగురు దుండగులు రెండు రైళ్ళ సిగ్నల్ బ్రేక్ చేసి దోపిడీ చేశారని తెలిపారు. మొదటి రైల్లో రెండు బోగీల్లో కలిపి మొత్తం ఏడుగురు వద్ద సుమారు 30 తులాల బంగారం చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు. రెండో రైల్ సిగ్నల్ ట్రాప్ చేసే క్రమంలో పోలీసులు గుర్తించారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. వారిపై రాళ్ల దాడి చేసి పరారీ అయినట్లు తెలిసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..