BH Number Fraud: విశాఖలో వెలుగులోకి భారీ స్కామ్.. BH సిరీస్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు..!
విశాఖలో కొత్తరకం స్కామ్ వెలుగులోకి వచ్చింది. కార్ షోరూమ్‌లలో బీహెచ్ సిరీస్ రిజిస్ర్టేషన్ పేరుతో భారీ మోసం బయటపడింది. ఈ మాయాజాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన రవాణా శాఖ అధికారులు.. అటు డీలర్లు, ఇటు వినియోగదారులకు షాక్ ఇస్తున్నారు.
విశాఖలో కొత్తరకం స్కామ్ వెలుగులోకి వచ్చింది. కార్ షోరూమ్‌లలో బీహెచ్ సిరీస్ రిజిస్ర్టేషన్ పేరుతో భారీ మోసం బయటపడింది. ఈ మాయాజాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన రవాణా శాఖ అధికారులు.. అటు డీలర్లు, ఇటు వినియోగదారులకు షాక్ ఇస్తున్నారు.
విశాఖపట్నంలో ఫోర్ వీలర్ రిజిస్ట్రేషన్ స్కామ్ వెలుగు చూసింది. వాహన డీలర్లు ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. సాధారణ వినియోగదారులు చెల్లించాల్సిన 17 శాతం లైఫ్ టాక్స్‌కు పక్క దారి మళ్లించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కొందరికి మాత్రమే అవకాశం ఉండే BH రిజిస్ట్రేషన్ మినహాయింపులను నొక్కేశారు. కేవలం 4 శాతం టాక్స్ జమ చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు కొందరు డీలర్లు. దీంతో విషయం తెలుసుకున్న రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి చర్యలకు సిద్ధమయ్యారు.
నకిలీ పత్రాలతో వాహనాలను BH సిరీస్‌లో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించిన డీలర్ల ఆధరైజేషన్‌ను సస్పెండ్ చేశారు రవాణా శాఖ అధికారులు. మోసానికి పాల్పడుతున్న త్రై స్టార్ మోటార్స్, వరుణ్ మోటార్స్, శివశంకర మోటార్స్ ఆథరైజేషన్‌ను సస్పెండ్ చేశామని, మరో 16 మంది డీలర్లకు నోటీసులు ఇచ్చామని టీవీ9కి వివరించారు విశాఖ డీటీసీ రాజారత్నం. అలా అక్రమంగా BH రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి 17 శాతం లైఫ్ టాక్స్ కట్టిస్తున్నామన్నారు.
విశాఖపట్నంలో నివాసం ఉంటున్న వారికి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నట్లుగా, కేంద్ర ప్రభుత్వ, మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగులుగా తప్పుడు నివాస, ధృవీకరణ పత్రాలను సృష్టించి తద్వారా వాహనాలను ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారు కొందరు ప్రబుద్ధులు. తమ సేల్స్‌ను పెంచుకోవడం కోసం కొంతమంది డీలర్లు చేసిన ఈ తప్పుడు భాగోతం విశాఖలో వెలుగు చూసింది. దీంతో తనిఖీలు చేపడుతున్న రవాణా శాఖా అధికారులు సంబంధిత వాహనాన్ని సీజు చేయడంతో పాటు సదరు వాహనానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ జారీ చేసినందుకు డీలరు గుర్తింపును సస్పెండ్ చేస్తున్నారు.
విశాఖపట్నంలో నివాసం ఉంటూ, ఇతర రాష్ట్రాలైన అరుణాచలప్రదేశ్, నాగాలాండ్, ఇతర రాష్ట్రాల నకిలీ అడ్రస్ ప్రూఫ్ తో BH సిరీస్‌లో రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి ఒక్క వాహనాన్ని సీజు చేయడంతో పాటు సంబంధిత వాహనాన్ని తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన డీలర్లు, వాహన యజమానుల పై ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించినందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ధర తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ రకంగా కార్లను కొనుగోలు చేసిన వినియోగదారులు.. అధికారుల చర్యలతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…