Andhra: ఇది కదా అసలైన పల్లెటూరి దీపావళి.. ఊరంతా కలిసి చేసుకునే సంబరం
ఏలూరు జిల్లాలోని పెరవలి మండలం ఖండవల్లి గ్రామం దీపావళిని విభిన్నంగా జరుపుకుంటుంది. ప్రతి ఇంటి ముందు ముగ్గులు, తోరణాలతో ఊరంతా పండుగ వాతావరణం అలుముకుంటుంది. గ్రామంలోని రైతులు తమ తోటల్లోని అరటి చెట్లను తీసుకువచ్చి, 18 రామాలయాల వద్ద గెలలతో సహా అలంకరిస్తారు.

ఎవరికి వారు తమ ఇళ్లలో పండుగ చేసుకుంటే ఆ ఆనందం కుటుంబానికే పరిమితం అవుతుంది. కానీ ఒక ఊరు అంతా కలిసి పండుగ చేసుకుంటే, ప్రతి వీధి వెలుగులతో నిండిపోతే.. ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్లు చాలవు. అలాంటి ఐక్యత, ఆనందం ఏ ఊరిలో ఉన్నా అద్భుతమే కదా..!. మనకు పండుగలంటే ఇంటి ముందు ముగ్గులు, గడపలకు తోరణాలు కట్టడం, రంగవల్లులు వేసుకోవడం తెలుసు. అయితే ఏలూరు జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లి గ్రామంలో దీపావళి వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో సుమారు 5 వేల మంది నివసిస్తున్నారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా గ్రామ రైతులంతా తమ తోటల్లో ఉన్న అరటి చెట్లను కాయలతో సహా తీసుకువచ్చి వీధుల్లో నాటుతారు. దీంతో గ్రామం మొత్తం పచ్చగా, పండుగ వాతావరణంలో మెరిసిపోతుంది.
గ్రామంలో మొత్తం 18 రామాలయాలు ఉన్నాయి. రైతులు ఈ దేవాలయాల వద్ద అరటి చెట్లను సుందరంగా అలంకరించి ఉంచుతారు. దీపావళి రాత్రి ఈ చెట్లపై మట్టి ప్రమిదలను పెట్టి వెలిగించడం ఆ గ్రామానికి మరింత అందాన్ని తీసుకువస్తుంది. వెలుగులతో నిండిన అరటి చెట్లు కాంతులు వెదజల్లుతూ చూసే వారిని మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి. పండుగ మరుసటి రోజు రామాలయాల వద్ద ఉంచిన అరటి గెలలను వేలం వేస్తారు. ఖండవల్లి గ్రామస్తులు మాత్రమే కాకుండా పొరుగున ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు తరలివస్తారు. రామాలయంలో ఉంచిన గెలలను ఇంటికి తీసుకెళ్లి ప్రసాదంగా భావించి భక్తితో వినియోగిస్తే శుభం కలుగుతుందని ప్రజలు నమ్మకం.
ఉభయగోదావరి జిల్లాల్లో అరటి తోటలు విస్తారంగా ఉండడం వల్ల ఈ ఆచారం అక్కడి గ్రామాల్లో సహజంగా పాతకాలం నుంచే కొనసాగుతోంది. అయితే ఖండవల్లి గ్రామంలో ఈ సంప్రదాయం ఇప్పటికీ అదే ఉత్సాహంతో కొనసాగడం విశేషం.




