Andhra Pradesh: మాటలకందని విషాదం.. కాళ్లు పోయినా కనికరించని మృత్యువు.. చావుతో పోరాడి ఓడిన చిన్నారి దర్శిత్..
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన వినోద్, చాందినిల మూడేళ్ల కొడుకు దర్శిత్. సరదాగా ఉండే దర్శిత్‌ని తల్లిదండ్రులు గారాబంగా చూసుకునేవారు. ఈ క్రమంలోనే బట్టలు ఆరేయడానికి..
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన వినోద్, చాందినిల మూడేళ్ల కొడుకు దర్శిత్. సరదాగా ఉండే దర్శిత్‌ని తల్లిదండ్రులు గారాబంగా చూసుకునేవారు. ఈ క్రమంలోనే బట్టలు ఆరేయడానికి వెళుతున్న తల్లితో కలిసి మేడపైకి వెళ్లాడు. తల్లి బట్టలు ఆరేస్తుండగా.. పక్కనే ఉన్న హెవీ విద్యుత్ తీగల సమీపానికి వెళ్లాడు దర్శిత్. ఒక్కసారిగా షాక్ కొట్టడంతో కిందపడి సృహకోల్పోయాడు. అప్పటివరకు ఆడుకుంటున్న కొడుకు ఒక్కసారిగా కింద పడిపోవడంతో వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కాకినాడలోని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు.
ఎలాగైనా తన కొడుకు ప్రాణం దక్కితే చాలనుకున్నారు ఆ బాలుడి తల్లిదండ్రులు. 4రోజుల చికిత్స తరువాత ఇన్‌ఫెక్షన్ సోకడంతో దర్శిత్‌కి రెండు కాళ్లూ మోకాళ్ల కింది వరకు తొలగించారు. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. అప్పటికీ ఇన్‌ఫెక్షన్ తగ్గకపోతే మేకాళ్లను కూడా తొలగించాల్సి ఉంటుందన్నారు. తరువాత కుడికాలులో మరికొంత భాగం నిన్న శస్త్రచికిత్స చేసి తొలగించారు.
ఆపరేషన్ తరువాత వార్డుకు తీసుకొచ్చిన కొద్దిసేపటికే దర్శిత్ గుండె కొట్టుకోవడం స్లో అయింది. అలా కొద్దిసేపటికి ఊపిరి కూడా ఆగిపోయింది. కాళ్లు లేకున్నా.. కొడుకు బతికితే కళ్లల్లో పెట్టుకుని చూసుకుందామనుకున్న ఆ తల్లిదండ్రులు.. గుండెలు బాదుకుంటున్నారు. ప్రాణాలతో అయిన చూసుకోవచ్చు అనుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది.
14రోజులు మృత్యువులో పోరాడి దర్శిత్ మృతి చెందడంతో పైడిమెట్ట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దర్శిత్‌ది పేద కుటుంబం.. ఆ బాలుడు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచీ..చికిత్స కోసం ఆతల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న కొందరు సాయం కూడా చేశారు. అయినా మృత్యువు ఆ చిన్నారి ప్రాణాలను వదల్లేదు. జీజీహెచ్‌లో బాలుడు మృతి చెందాడన్న విషయం లెలుసుకున్న హోం మంత్రి తానేటి వనిత దర్శిత్ తల్లిదండ్రులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు హోంమంత్రి తానేటి వనిత. బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..