Telugu Desam Party: మళ్లీ రిపీట్ అవుతుందా.. బ్రేక్ పడుతుందా..? తెలుగుదేశం పార్టీకి ‘ఆగస్ట్’ టెన్షన్..
Telugu Desam Party -August: ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఆగస్ట్ టెన్షన్ మొదలైంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక మార్పులు, నిర్ణయాలన్నీ ఆగస్ట్‌లోనే జరిగాయి. పార్టీకి నష్టం కలిగించేలా కొన్ని ప్రధాన ఘట్టాలన్నీ ఆగస్టులోనే జరిగాయి. దీంతో ఈ ఆగస్ట్‌లో ఏం జరగబోతుందనే టెన్షన్ .. అటు ముఖ్య నాయకుల్లో..
అమరావతి, జులై 31: ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఆగస్ట్ టెన్షన్ మొదలైంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక మార్పులు, నిర్ణయాలన్నీ ఆగస్ట్‌లోనే జరిగాయి. పార్టీకి నష్టం కలిగించేలా కొన్ని ప్రధాన ఘట్టాలన్నీ ఆగస్టులోనే జరిగాయి. దీంతో ఈ ఆగస్ట్‌లో ఏం జరగబోతుందనే టెన్షన్ .. అటు ముఖ్య నాయకుల్లో.. ఇటు తెలుగు తమ్ముళ్లలో మొదలైంది. తెలుగుదేశం పార్టీని 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తర్వాత 1984లో నాదెండ్ల భాస్కర్ రావు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసారు. కేవలం నెలరోజుల పాటు మాత్రమే సీఎం పదవిలో ఉన్నప్పటికీ.. ఆగస్ట్ లో జరిగిన పరిణామాలతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మాత్రం ఆగస్ట్ సెంటిమెంట్ గానే భావించారు. ఇక ఆ తర్వాత ఆగస్ట్ నెలాఖరులోనే ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలను దక్కించుకున్నారు. ఇలా రెండుసార్లు ఎన్టీ రామారావు తన ముఖ్యమంత్రి పదవిని ఆగస్ట్ లోనే కోల్పోవడంతో తెలుగుదేశం పార్టీకి ఆగస్ట్ నెల కలిసిరాదనే సెంటిమెంట్ బలంగా పాతుకుపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆగస్ట్ మాసం వచ్చిందంటే చాలు ఏం జరుగుతుందోననే టెన్షన్ అటు కీలక నేతల్లో.. ఇటు పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తుంది.
ల్యాండ్ స్కాం, పొత్తుల విషయంలో..
ఆగస్ట్ నెల పార్టీకి చేదు అనుభవాలనే మిగిల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2000వ సంవత్సరంలో బషీర్ బాగ్ కాల్పుల ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది. రైతులపై చంద్రబాబు హయాంలో జరిగిన కాల్పుల ప్రభావం 2004 ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. అయితే, కాల్పులు జరిగింది మాత్రం ఆగస్ట్ కావడం చర్చించుకోదగ్గ విషయంగా మారింది. ఇక 2019లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీకి ఆగస్ట్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత ఆగస్ట్ కంటే రెండు నెలల ముందుగానే టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. ఇక గతంలో జరిగిన అనుభవాలతో ఈసారి ఆగస్టులో ఏం జరగనుందనే చర్చ మొదలైంది. ఇప్పటికే అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణతో పాటు పలువురిపై నమోదైన కేసు విచారణ వేగంగా జరుగుతుంది. ఈకేసు తుది విచారణ ఆగస్ట్ 10న జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ఉన్నత న్యాయస్థానం ఏం తీర్పు ఇవ్వనుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్రంలో పొత్తులకు సంబంధించి ఆగస్టులోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనల తర్వాత పొత్తుల అంశం డైలమాలో పడింది. దీంతో ఆగస్టులో ఎవరు ఎవరితో నడుస్తారనే దానిపై స్పష్టత రావచ్చంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు..
ఆగస్టులో చంద్రబాబు బిజీ.. బిజీ..
ఎంతకాదనుకున్నా ఆగస్ట్ టెన్షన్ మాత్రం చంద్రబాబు మొదలు పార్టీ నేతలు, కార్యకర్తల్లో కనిపిస్తూనే ఉంటుంది. దీంతో ఎలాంటి సమస్య రాకుండా పకడ్బందీగా పార్టీలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఇక ఆగస్ట్ లో పదిరోజుల పాటు రాయలసీమల ప్రాజెక్టుల సందర్శనతో ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా భవిష్యత్తుకు భరోసా కార్యక్రమం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిద్వారా గతంలో ఆగస్టు నెలలో జరిగిన పరిణమాలను మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..