Neem Tree: అయ్ బాబోయ్ ఇదేంటి.. వేప చెట్టు నుంచి నీళ్లు వస్తున్నాయ్ ?
Prakasham News: ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఓ వేప చెట్టును నరుకుతూ ఉండగా అకస్మాత్తుగా వేప చెట్టు నుండి నీరు ఉబికి వచ్చింది. ధారలా కారుతున్న మంచినీటి చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఆ నీటిని తాగిన వారు నీరు చాలా స్వచ్ఛంగా ఉందని చెబుతున్నారు.

ప్రకాశం, జులై 31: ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఓ వేప చెట్టును నరుకుతూ ఉండగా అకస్మాత్తుగా వేప చెట్టు నుండి నీరు ఉబికి వచ్చింది. ధారలా కారుతున్న మంచినీటి చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఆ నీటిని తాగిన వారు నీరు చాలా స్వచ్ఛంగా ఉందని చెబుతున్నారు. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది…
పాలు కారడం చూశాం.. మరి ఈ నీళ్ళేంటి ?
సాధారణంగా వేప చెట్టు నుంచి పాలు కారడం అక్కడక్కడ చూస్తుంటాం. అయితే పోతురాజుటూరు గ్రామంలో వింతగా వేపచెట్టు నుంచి నీళ్లు కారుతున్నాయి. వేపచెట్టుకు పాలుకారడం వెనుక దేవతల మహిమ ఉందని స్థానికులు నమ్మేవారు. అంతే కాకుండా వేపచెట్టు దేవతా స్వరూపమని, స్థానిక దేవతలైనా నూకాలమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతలకు ఈ వేపచెట్టు ప్రతిరూపమని భావిస్తారు. అందుకే పచ్చగా ఉన్న వేపచెట్టును నరకవద్దని చెబుతారు. అయితే పోతురాజుటూరు గ్రామంలో వేపచెట్టును కొట్టేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో చెట్టు మొదలు నుంచి కుళాయి నుంచి వచ్చినట్టు ధారగా నీళ్ళు రావడం మరో వింతగా చెప్పుకుంటున్నారు. ఈ నీటిని పలువురు తాగి చాలా బాగున్నాయని చెప్పడం విశేషం. వేపచెట్టు నుంచి నీళ్ళు కారుతుండటంతో ఆ వేపచెట్టును కొట్టడం ఆపేశారు స్థానికులు. అలా ఆ వేపచెట్టు ప్రస్తుతానికి బతికిపోయింది…




పాలు, నీరు కారడం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనేనా..? వేప చెట్టు నుంచి పాలు, నీరులాంటి ద్రవాలు కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా జరగడాన్ని అగ్రోబ్యాక్టీరియం ట్యూమెఫేసియన్స్ అంటారు. వేప చెట్టు పెద్దదయ్యేకొద్ది తనలో ఎక్కువగా ఉన్న నీటిని కణాల్లో నిల్వ చేసుకోవడం మొదలుపెడుతుందట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై తొర్రల్లా వస్తాయి. వర్షాలు పడిన తరువాత, వాతావరణంలో తేమ శాతం ఎక్కువైనప్పుడు ఎవరైనా నరకితే ఈ విధంగా పాలు, నీరు రూపంలో చెట్టు కణాల్లో నిక్షిప్తమైనవి బయటకు వస్తాయి. వేప కొమ్మల్లోని తొర్రలు బలహీనపడి పగుళ్లు ఇచ్చిన సమయంలో కూడా ఎవరి ప్రమేయం లేకుండానే పాలు, నీరు వంటి ద్రవాలు బయటకు వస్తాయి. ఇలాంటి ఘటనలు వేపచెట్టుకు కొత్తకాదని, 50 ఏళ్ళు దాటిన ప్రతి వేపచెట్టుకు ఇలా జరుగుతుందని వృక్షశాస్తవేత్తలు చెబుతున్నారు.
