అర్ధరాత్రి వరకు చంద్రబాబు, కూటమి నేతల చర్చలు.. ఏ క్షణమైనా ప్రకటన వచ్చే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ముమ్మరమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూటమి నేతలు అర్ధరాత్రి వరకు సమావేశమై పోటీ చేసే స్థానాలు, పార్టీల బలాబలాలపై చర్చించారు. ఎక్కడ ఏ పార్టీకి బలం ఎక్కువగా ఉంటే అక్కడ ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేలా నిర్ణయం తీసుకుంటామని జనసేన నేతలు చెబుతున్నారు. సీట్ల పంపకాలు, అభ్యర్థుల ప్రకటనపై అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠ నెలకొంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దీంతో.. సీట్ల సర్దుబాటుపై కసరత్తు ముమ్మరం చేశాయి కూటమి పార్టీలు. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన జనసేన నేతలు.. కూటమి పార్టీల్లో ఎలాంటి విభేదాలు లేవని.. కలిసి పోటీచేసి మెజార్టీ సీట్లు గెలుస్తామంటున్నారు. మరి మూడు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ ఏ విధంగా ఉండబోతోంది?..
కూటమిలో సీట్ల సర్దుబాటుపై ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో పాటు.. 100 అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. రెండు, మూడు రోజులుగా సీట్ల సర్దుబాటుపై తీవ్రంగా కసరత్తు జరిపిన మూడు పార్టీల నేతలు.. సీఎం చంద్రబాబుతో.. ఫైనల్ టాక్స్ నడుపుతున్నారు. అర్థరాత్రి వరకు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయి. జనసేన తరపున నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున సత్యకుమార్, మాధవ్ సీఎంతో చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై ఇవాళ ప్రకటన విడుదల చేసి.. అభ్యర్థుల ఎంపికపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. విడివిడిగా కాదు.. ఎన్నిక ఏదయినా.. కలిసికట్టుగానే ముందుకెళ్దామని అన్ని పార్టీలు ఫిక్స్ అయ్యాయి. ఫ్రెంఢ్లీ ఫైట్లు ఎక్కడా ఉండవంటూ ఇప్పటికే ఫుల్ క్లారిటీ ఇచ్చింది జనసేన.
బీజేపీ నేతలకంటే ముందు చంద్రబాబుతో జనసేన నేతలు సమావేశం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సీట్ల పంపకాలు, పార్టీల బలాబలాలపైనే భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. చంద్రబాబుతో భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఏ ప్రాంతంలో ఏ పార్టీకి బలం ఎక్కువగా ఉంటే.. అక్కడ ఆ పార్టీ అభ్యర్థి పోటీ చేసేలా నిర్ణయం తీసుకుంటామని.. సీట్ల సంఖ్య కంటే గెలుపే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్కు తావులేదని.. కూటమి అభ్యర్థులు ఒకే లక్ష్యంతో బరిలోకి దిగుతారన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. అభ్యర్థుల ప్రకటన కూడా కూటమి తరఫునే ఉంటుందని.. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై మరోసారి చర్చించి నిర్ణయిస్తామన్నారు.
తగ్గాల్సిన చోట తగ్గుతాం.. నెగ్గాల్సిన చోట నెగ్గుతాం అంటున్నారు జనసేన నేతలు. కూటమిగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది.. అంతా పవన్ కోరినట్టే జరుగుతుందని చెబుతున్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కలిసి పోటీచేయడంతో పాటు మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
