Rain Alert: బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు..
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. . ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో మరో ఉపరిత ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఏపీలో కొద్ది రోజుల వ్యవధిలోనే అర్నబ్, మురసు తుఫాన్ బీభత్సం సృష్టించగా.. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అలాగే రోడ్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది. ఈ తుఫాన్ల ప్రభావంతో వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. మురసు తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు పడుతుండగా.. రాబోయే కొద్ది రోజుల పాటు ఈ వానలు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణశాఖ ప్రకటించింది. దీపావళి తర్వాత ఈ నెల 11న ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఏపీకి భారీ వర్షసూచన
అయితే అల్పపీడనం బలపడుతుందా.. లేదా అనేది వాతావరణశాఖ ఇంకా అంచనా వేయలేదు. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే ఛాన్సుంది. కానీ వీటి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. శుక్రవారం అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వడతాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు. భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, మునిగిపోయిన కాజ్‌వేలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కరిసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గడ్వాల్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణశాఖ ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశముందని హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. వర్షాల క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
