ముందే తెలిస్తే మహేష్‌ను ఆ సినిమా చెయ్యొద్దని చెప్పేవాడిని.. కృష్ణకు నచ్చని మహేష్ మూవీ ఎదో తెలుసా.?
మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణ, తన సినీ ప్రస్థానం, కుటుంబ జీవితం, మహేష్ బాబు కెరీర్, మరియు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన మార్పులపై తన ఆలోచనలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మహేష్ బాబు తీసుకునే నిర్ణయాలపై తాను ఎప్పుడూ పూర్తిగా మద్దతు ఇచ్చానని తెలిపారు. అయితే, నాని సినిమా సబ్జెక్టు తాను వినలేదని, ఒకవేళ విని ఉంటే మహేష్‌కు వద్దనేవాడినని స్పష్టం చేశారు. ఎందుకంటే, అది చిన్న కుర్రాడి పాత్ర అని, పెద్ద ఇమేజ్ ఉన్న మహేష్‌కు అది సరిపోదని, తమిళంలో ఒక కొత్త నటుడితో ఆ చిత్రం విజయం సాధించిందని కృష్ణ వివరించారు.
కుటుంబ సమయం గురించి మాట్లాడుతూ, అందరూ కలిసి సరదాగా గడుపుతారని తెలిపారు. అప్పుడప్పుడు తాను ఇంట్లో అందరికీ వంట చేస్తానని, ముఖ్యంగా మహేష్‌కు తాను చేసే పాయా అంటే చాలా ఇష్టమని చెప్పారు. మంజులకు నాన్-వెజ్ అలవాటు లేకపోవడంతో ఆమె కోసం టొమాటో రైస్ చేస్తానని, దాని కోసమే ఆమె వస్తుందని పేర్కొన్నారు. పిల్లలు ఖాళీగా ఉన్నారని తెలిస్తే అందరినీ భోజనానికి పిలుస్తానని తెలిపారు. మల్టీస్టారర్ చిత్రాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, తన కాలంలో మల్టీస్టారర్లకు ఎంతో ప్రోత్సాహం ఉండేదని అన్నారు. రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణం రాజు, రజనీకాంత్, శివాజీ గణేషన్ వంటి ఎంతో మందితో కలిసి నటించానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో హీరోల మధ్య ఈర్ష్యలు లేవని, ప్రతి ఒక్కరూ తమ పాత్ర బాగుండాలని కోరుకునేవారే తప్ప, ఎదుటివారికి మంచి జరగకూడదని ఎవరూ అనుకునేవారు కాదని తెలిపారు. తన కళను పంచుకోవడంతో పాటు, పరిశ్రమలో ఎంతో మందికి పని దొరకాలని ఏడాదికి 18 సినిమాలు కూడా చేశానని, ఆ రోజుల్లో 25-30 రోజుల్లోనే సినిమా తీసేవారని గుర్తుచేసుకున్నారు.
నేటి సినీ పరిశ్రమ పరిస్థితిపై కృష్ణగారు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతి దానికీ ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గిపోయిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సంగీతం, కాస్టింగ్ వంటి వాటిపై దృష్టి తగ్గింది. ఒకప్పుడు బడ్జెట్ ప్రకారం సినిమాలు తీసి, సమయానికి విడుదల చేసేవారని, అందుకే అవి విజయం సాధించేవని అన్నారు. ఇప్పుడు ఒక సినిమా పూర్తి కావడానికి ఆరు నెలల నుండి ఒక సంవత్సరం కూడా పడుతుందని, 250-300 రోజులు చిత్రీకరణ జరుగుతోందని పేర్కొన్నారు. పాటల సాహిత్యం అర్థం కావడం లేదని, పెద్ద బడ్జెట్, గ్రాఫిక్స్ ఉన్న చిత్రాలను మాత్రమే చూస్తున్నారని, కథా విలువ ఉన్న చిన్న చిత్రాలను ఆదరించడం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పిక్చర్లు కూడా చూసే రోజులు మళ్ళీ వస్తేనే పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందని కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
