AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: టీటీడీ గుడ్ న్యూస్.. వారికి ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ.. ఎప్పటినుంచంటే..?

శ్రీవారి సేవలో ఏళ్ల తరబడి భాగస్వాములైన రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి ఏటా అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాల పంపిణీకి రంగం సిద్ధమైంది. నవంబర్ 7 నుంచి 20వ తేదీ వరకు ఈ పవిత్ర ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అయితే వృద్ధులైన పెన్షనర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పీపీఓ నంబర్ల వారీగా ప్రత్యేక షెడ్యూల్‌ను టీటీడీ ఖరారు చేసింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Tirumala: టీటీడీ గుడ్ న్యూస్.. వారికి ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ.. ఎప్పటినుంచంటే..?
Ttd Good News For Retired Employees
Krishna S
|

Updated on: Nov 05, 2026 | 6:24 PM

Share

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం తమ సంస్థలో ఏళ్ల తరబడి సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఏటా ఆనవాయితీగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పాటిస్తూ, బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నవంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు విశ్రాంత ఉద్యోగులకు, ఫ్యామిలీ పెన్షనర్లకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలను ఉచితంగా అందజేయనున్నట్లు టీటీడీ అధికారికంగా వెల్లడించింది.

పంపిణీ వేదిక – సమయ వేళలు

తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వయోవృద్ధులైన పెన్షనర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని కేటీ రోడ్డులో ఉన్న టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలోని ఉద్యోగుల క్యాంటీన్ సమీపంలో గల కొత్త జాబాలి భవనం వద్ద ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. నిర్దేశిత తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిరంతరాయంగా ప్రసాదాల కౌంటర్లు తెరిచి ఉంటాయి. అర్హులైన ప్రతి పింఛన్‌దారునికి పవిత్రమైన ఒక పెద్ద లడ్డూ, వడ ప్రసాదం అందజేస్తారు.

రద్దీ నివారణకు పీపీఓ నంబర్ల వారీగా షెడ్యూల్

వేల సంఖ్యలో ఉండే విశ్రాంత ఉద్యోగులు ఒకేసారి రావడం వల్ల తోపులాటలు, ఎండలో ఎక్కువసేపు నిలబడే ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు యాజమాన్యం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్ల వారీగా తేదీలను విభజించింది. సంబంధిత పెన్షనర్లు తమ కేటాయించిన రోజుల్లోనే రావాల్సి ఉంటుంది.

  • నవంబర్ 7 – PPO నంబర్ 164 నుండి 3,250 వరకు
  • నవంబర్ 9 నుండి 13 వరకు – PPO నంబర్ 3,251 నుండి 9,050 వరకు
  • నవంబర్ 16 నుండి 19 వరకు – PPO నంబర్ 9,051 నుండి 12,550 వరకు
  • నవంబర్ 20 – PPO నంబర్ 12,551 నుండి మిగిలిన వారందరికీ

స్మార్ట్ కార్డు తప్పనిసరి: టీటీడీ విజ్ఞప్తి

ప్రసాదం పొందాలనుకునే విశ్రాంత ఉద్యోగులు లేదా కుటుంబ పింఛన్‌దారులు సంబంధిత కౌంటర్ల వద్ద గుర్తింపు కోసం తమ ఒరిజినల్ స్మార్ట్ కార్డును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. స్మార్ట్ కార్డు ఉంటేనే ప్రసాదాల జారీ వేగవంతంగా పూర్తవుతుంది. వయసు పైబడిన వారు, అనారోగ్యంతో ఉన్న విశ్రాంత ఉద్యోగులు ప్రసాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, వేచి ఉండే షెడ్లు వంటి కనీస మౌలిక వసతులను దేవస్థానం కల్పించింది. నిర్ణీత తేదీలు, పీపీఓ నంబర్లను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో శ్రీవారి ప్రసాదాలను స్వీకరించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా టీటీడీ యాజమాన్యం కోరింది.

Follow Us