AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: దీపావళి రాత్రి ఈ పని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.. ఇంటి తలుపు విషయంలో పెద్దలు చెప్పిన రహస్యం ఇదే!

Diwali Main Door Vastu Telugu: దీపావళి రాత్రి ఇంటి ప్రధాన తలుపును తెరిచి ఉంచే ఆచారం గురించి ఎప్పుడైనా విన్నారా? లక్ష్మీదేవి, కుబేరుడు ఇంట్లోకి ప్రవేశిస్తారనే విశ్వాసంతో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారని చెబుతారు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు, వాస్తు విశ్వాసాలు ఏమిటో తెలుసుకుందాం.

Diwali: దీపావళి రాత్రి ఈ పని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.. ఇంటి తలుపు విషయంలో పెద్దలు చెప్పిన రహస్యం ఇదే!
Diwali Main Door Vastu Telugu
Rajashekher G
|

Updated on: Nov 06, 2026 | 9:51 AM

Share

Diwali Main Door Vastu Telugu: దీపావళి అంటే చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, నిరాశపై ఆశ, దారిద్య్రంపై సంపదకు ప్రతీకగా భావించే పవిత్రమైన పండుగ. ఈ ఏడాది దీపావళి పండుగను నవంబర్ 8, 2026, ఆదివారం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లను శుభ్రం చేసి, దీపాలతో అలంకరించి, లక్ష్మీదేవి, వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దీపావళి రోజున పాటించే ప్రతి ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక భావన దాగి ఉంటుందని పెద్దలు చెబుతారు.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాలు ఎందుకు వెలిగిస్తారు?

దీపావళి రోజున ఇంటి ప్రధాన ద్వారం ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇంటికి వచ్చే శుభశక్తులు, అతిథులు మొదట ప్రవేశించేది ప్రధాన ద్వారం నుంచే కాబట్టి దానిని శుభ్రంగా ఉంచి, ముగ్గులు, తోరణాలతో అలంకరిస్తారు. ఇరువైపులా దీపాలను వెలిగిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం దీపావళి రాత్రి లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తూ పరిశుభ్రంగా, దీపకాంతులతో కళకళలాడుతున్న ఇళ్లను అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే ప్రధాన ద్వారం వద్ద వెలుగు ఉండటం శుభానికి సంకేతంగా భావిస్తారు.

దీపావళి రాత్రి తలుపు ఎందుకు తెరిచి ఉంచాలి?

జ్యోతిష్యులు వివరించిన ప్రకారం, మతపరమైన విశ్వాసాలు, వాస్తు సంప్రదాయాల ప్రకారం దీపావళి రోజున ప్రదోష కాలం నుంచి నిశీథ కాలం వరకు ప్రధాన ద్వారం తెరిచి ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి, కుబేరుడు ఇంట్లోకి ప్రవేశించి సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సును ప్రసాదిస్తారనే విశ్వాసంతో తలుపులు పూర్తిగా మూసివేయకుండా ఉంచే ఆచారం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మూసివేసిన తలుపు కంటే దీపాలతో వెలిగే తెరిచిన ద్వారం దేవతలను ఆహ్వానించే సంకేతంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

సానుకూల శక్తికి ఆహ్వానం

వాస్తు సంప్రదాయంలో ప్రధాన ద్వారాన్ని ఇంటి ముఖంగా పరిగణిస్తారు. అందువల్ల ద్వారం వద్ద శుభ్రత, వెలుగు, సానుకూల వాతావరణం ఉండటం ముఖ్యమని చెబుతారు. నెయ్యి లేదా ఆవాల నూనెతో వెలిగించిన దీపాలను ద్వారం ఇరువైపులా ఉంచడం ద్వారా ఇంట్లోకి శుభశక్తులు ప్రవేశిస్తాయని విశ్వాసం. అయితే రాత్రంతా తలుపులు తెరిచి ఉంచడం ప్రతి ఇంటికీ సాధ్యం కాదు. భద్రత దృష్ట్యా తలుపును మూసివేయాల్సి వస్తే, ప్రధాన ద్వారం వద్ద నిరంతరం వెలిగే అఖండ దీపాన్ని ఉంచడం ద్వారా దీపకాంతిని కొనసాగించే ఆచారం కూడా ఉంది.

అందుకే దీపావళి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచడం, ప్రధాన ద్వారం వద్ద దీపాలు వెలిగించడం, లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించడం వంటి ఆచారాలు కేవలం సంప్రదాయాలు మాత్రమే కాకుండా మన జీవితంలో వెలుగు, శాంతి, ఐశ్వర్యం నిండాలని కోరుకునే ఆధ్యాత్మిక సంకల్పానికి ప్రతీకలుగా భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలోని విషయాలు మతపరమైన విశ్వాసాలు, సంప్రదాయాలు, వాస్తు నమ్మకాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించకూడదు. ప్రాంతీయ ఆచారాలు, సంప్రదాయాలు మారవచ్చు.)

Follow Us