కంపెనీ బాస్ అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగులకు ఖరీదైన ఐఫోన్లు గిఫ్ట్.. లక్కీ కదా..
మహిళా ఉద్యోగులకు ఒక కంపెనీ ఏకంగా ఖరీదైన ఐఫోన్లను గిఫ్ట్‌గా అందించింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. గతంలోనూ కొంతమంది ఉద్యోగులకు ఐఫోన్లను బహుమతిగా అందించిన ఈ కంపెనీ.. ఇప్పుడు మహిళా ఉద్యోగులకు అందించింది. ఇందులో ఒక హౌస్ కీపింగ్ మహిళకు కూడా అందించారు.

దీపావళి సందర్భంగా ఉద్యోగులకు కంపెనీలు బహుమతులు అందిస్తుండటం మనం చూస్తుంటాం. కొన్ని కంపెనీలు అధిక విలువ చేసే భారీ బహుమతులు అందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. లగ్జరీయస్ వస్తువులు ఉద్యోగులకు కొన్ని కంపెనీల యజమాన్యాలు అందిస్తుంటాయి. ఇలాంటివి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. యూఏఈకి చెందిన ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్.. కేరళలో తన ఉద్యోగులకు ఏకంగా ఐఫోన్లు గిఫ్ట్‌గా అందించింది. తమ కంపెనీకి సంబంధించి మహిళా ఉద్యోగులకు ఐఫోన్లను బహుమతిగా ఇచ్చింది. వీటిని చూసి ఉద్యోగులు భావోద్వేగానికి గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఏకంగా 20 లక్షల వ్యూస్ వచ్చాయి.
వరల్డ్ స్టార్ హోల్డింగ్ అనే సంస్థ తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు ఐఫోన్లను బహుకరించింది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హసీనా నిషాద్ వీటిని అందించారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మహిళా ఉద్యోగులను ఆమె కాన్పరెన్స్ రూమ్‌లోకి పిలిచారు. వారి సీట్లలో కూర్చోమని చెబుతారు. మహిళలు కూర్చోడానికి కుర్చీలను బల్ల కింద నుంచిలాగగానే కుర్చీలపై పెద్ద గిఫ్ట్ బాక్స్ పెట్టి ఉంది. ఈ బాక్సులను ఓపెన్ చేసి చూడగానే ఐఫోన్లు ఉన్నాయి. వీటిని చూసి ఉద్యోగులు ముందుగా ఆశ్చర్యానికి.. ఆ తర్వాత ఆనందానికి లోనయ్యారు. ఒక హౌస్ కీపింగ్ మహిళ ఐఫోన్ డ్యూయోను చూసి నిషాద్‌ను భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. ఆమె పక్కనే కూర్చోని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ భావోద్వేగ క్షణాలు వీడియోలో కనిపించాయి. అయితే ఈ కంపెనీ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన కూడా ఉద్యోగులకు ఐఫోన్లను అందించింది. నిషాద్ భర్త, కంపెనీ యజమాని నిషాద్ హుస్సేన్ అప్పట్లో ఉద్యోగులకు ఈ గిఫ్ట్‌లను అందించారు. హౌస్ కీపింగ్ సిబ్బందికి ఐఫోన్లు అందించడాన్ని నెటిజన్లు అభినందించారు.
ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ.. మహిళలు ఎదిగి తమ కలలను సాకారం చేసుకోవాలనే తన ఆకాంక్ష గురించి వివరించారు. “ప్రతి మహిళకు తనదైన కలలు, బాధ్యతలు, సవాళ్లు ఉంటాయని నాకు తెలుసు. మీలో ప్రతి ఒక్కరూ మరింత బలపడాలని, మరింత ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని, మీరు కలలు కనే ప్రతిదాన్నీ సాధించాలని నా ఆకాంక్ష. మరో మహిళ ఎదగడం, విజయం సాధించడం, రాణించడం చూడటం కంటే నాకు గర్వకారణమైన విషయం మరొకటి లేదు. ఒక మహిళ ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు, ఆమె మరో మహిళకు కూడా ఎదగడానికి ధైర్యాన్ని ఇస్తుంది” అని రాసుకొచ్చారు.
View this post on Instagram
