Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: గుడ్‌న్యూస్‌లే గుడ్‌న్యూస్‌లు.. ఇది కదా ఏపీ విద్యార్ధులకు కావాల్సింది

ఏపీ విద్యార్ధులకు వరుసగా గుడ్ న్యూస్‌ల మీద గుడ్‌న్యూస్‌లు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నో బ్యాగ్ డేతో పాటు స్కూల్ యూనిఫాం‌లో మార్పు.. అలాగే పుస్తకాల బరువు తగ్గించడం లాంటి చర్యలు చేపడుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో చూసేయండి.

AP News: గుడ్‌న్యూస్‌లే గుడ్‌న్యూస్‌లు.. ఇది కదా ఏపీ విద్యార్ధులకు కావాల్సింది
Students
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2025 | 8:43 PM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త యూనిఫారాలు అందించనున్నారు. ఈ కొత్త యూనిఫార్మ్‌తో పాటు స్కూల్ బ్యాగ్, బెల్ట్ వంటి విద్యా సామగ్రిని కూడా ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. విద్యార్థులకు మరింత గౌరవప్రదమైన రూపాన్ని అందించడానికి, విద్యా ప్రాముఖ్యతను మరింత పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ కొత్త యూనిఫార్మ్ నమూనాలను శాసనసభలో స్వయంగా ప్రదర్శించిన మంత్రి, విద్యార్థుల కోసం క్వాలిటీ ముడి సామాగ్రిని ఉపయోగించి వీటిని రూపొందించినట్లు వివరించారు. పాత విద్యా విధానంలో ఉన్న లోపాలను అధిగమించి, మరింత సమర్థవంతమైన పద్ధతిని అమలు చేయడమే లక్ష్యమని తెలిపారు.

పుస్తకాల బరువు తగ్గింపు – సెమిస్టర్ విధానం

విద్యార్థుల భుజాలపై పుస్తకాల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో సెమిస్టర్ విధానం అమలులోకి రానుంది. విద్యార్థులు ఒకేసారి ఎక్కువ పుస్తకాలు మోసే అవసరం లేకుండా, ఒక్కో సెమిస్టర్‌కు అవసరమైన పుస్తకాలను మాత్రమే అందించనున్నారు. ముఖ్యంగా ఒకటో తరగతి విద్యార్థులకు ఒక్కో సెమిస్టర్‌కు కేవలం రెండు పుస్తకాలే ఉంటాయి. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, వారికి పాఠాలను మెరుగ్గా అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ విధానం వల్ల విద్యార్థులకు క్రమశిక్షణ పెరుగుతుందని, మరింత ఆసక్తితో చదవగలుగుతారని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

‘నో బ్యాగ్ డే’

ప్రతీ శనివారం ‘నో బ్యాగ్ డే’గా ప్రకటిస్తూ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ రోజు విద్యార్థులు స్కూల్ బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ వర్క్, సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి కలిగించేలా పాఠశాలలు ఏర్పాట్లు చేయాలని సూచించబడింది.

ఉపాధ్యాయుల శిక్షణ – నూతన కార్యక్రమాలు

విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించాలంటే ఉపాధ్యాయులు కూడా నవీన శిక్షణ పొందడం అత్యవసరం. అందుకే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అంతేకాదు, వారిని ఇతర దేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాలను అధ్యయనం చేసే అవకాశం కల్పించనున్నారు.

విద్యలో మరిన్ని సంస్కరణలు

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరిన్ని మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో యాక్టివ్ లెర్నింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తూ, విద్యార్థుల మెరుగైన అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై పాఠ్యపుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.