Araku Coffee: అరకు కాఫీకి అరుదైన గౌరవం.. లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతమైన అరకు వ్యాలీ ఈ కాఫీ పంటకు ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీ త్వరలో పార్లమెంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఏపీ పార్లమెంటు సభ్యుల విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ ప్రచార కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పార్లమెంట్‌లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు కోసం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. స్పీకర్ ఓం బిర్లాను కలిసి అరకు కాఫీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించినట్లు రామ్మోహన్‌నాయుడు స్పీకర్‌కు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గిరిజన ప్రాంతమైన అరకు వ్యాలీ ఈ కాఫీ పంటకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు అరకు కాఫీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించాలని ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యులు లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలోనే పార్లమెంటు ప్రాంగణంలో శాశ్వతంగా అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయడానికి కూడా అనుమతులు ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. అరకు కాఫీ ప్రత్యేకతకు మంచి ఆదరణ లభిస్తుందని, దీర్ఘకాలిక మార్కెట్ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఈ కాఫీ ఉత్పత్తి ద్వారా స్థానిక రైతులకు కూడా లాభాలు చేకూరుతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు.
ఇక.. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు అరకు కాఫీ ప్రచార కార్యక్రమం నిర్వహణకు అనుమతిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పర్మినెంట్ స్టాల్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్లమెంట్‌లో అరకు కాఫీ స్టాల్ పెడితే.. దానికి మరింత గుర్తింపు లభిస్తుందని, దేశవ్యాప్తంగా కాఫీ ప్రేమికుల్లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని ఏపీ ఎంపీలు అభిప్రాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..