దేశం పేరు అధికారికంగానే భారత్ అని పిలవాల్సిందే.. ఆర్ఎస్‌ఎస్ నేత కీలక వ్యాఖ్యలు
ఇండియా దటీజ్ భారత్ అంటూ రాజ్యాంగంలో రాసి ఉంటుంది. భారత్ అంటే ఇండియా, ఇండియా అంటే భారత్ అన్నది సుస్పష్టం. కాని ఇక్కడో వివాదం వచ్చి పడింది. కేంద్ర సంస్థలు, అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ పాలసీలపై ఈ ఇండియా ఎందుకు అంటున్నారు ఆర్‌ఎస్‌స్ పెద్దలు. భారత్‌గా మార్చాలన్న కామెంట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది.

ఇండియా అంటే భారత్ రాజ్యాంగంలోని మొదటి పేజీలో రాసున్న లైన్ ఇది. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. ఇండియా ఇంగ్లిష్ మాట్లాడేవారు పిలుచుకుంటారని.. మనం భారత్ అనే పిలవాలంటున్నారు RSS జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే. దేశం పేరు అధికారికంగానే భారత్ అని ఉంటే.. కేంద్ర సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని మార్చాలంటున్నారు. అంతేకాదు.. కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పేరులోనూ భారత్ చేర్చాలని చెబుతున్నారు. మనదేశంలో కేవలం భారత్ అనే పిలవాలని.. ఇండియాను మానుకోవాలంటున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన జీ20 డిన్నర్ ఇన్విటేషన్‌పైనా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే రాశారని గుర్తుచేశారు. ఇండియా పేరుని మార్చి భారత్ అని పిలవాలంటున్నారు.
అయితే దత్తాత్రేయ హొసబలె కామెంట్స్‌పై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి స్పందించారు. మన దేశానికి మూడు పేర్లు ఉన్నాయన్నారు ఒమర్ అబ్దుల్లా. ఇండియా, భారత్, హిందుస్తాన్ అని మనల్ని పిలుస్తారని.. ఎవరికి నచ్చిన పేరుతో వారు పిల్చుకోవచ్చంటున్నారు. ఇండియాన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ ఆర్మీ అని పిలవట్లేదా? అని గుర్తుచేశారు. ఇక సారేజహాసే అచ్చా.. హిందుస్తాన్ హమారా అని పాడుకోవడంలో.. ఎవరికీ ఎలాంటి సమస్య లేదన్నారు. ఇక దత్తాత్రేయ హొసబలె వ్యాఖ్యలపై సీపీఐ ఎంపీ పి సందోష్ కుమార్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ వివాదాన్ని రేపడం వెనుక కారణమేంటో చెప్పాలన్నారు. అయినా వారి సంస్థపేరుని RSSనుంచి మార్చుకోవాలని.. ఆంగ్ల అక్షరాలు వాడకూడదు కదా అని ప్రశ్నించారు.
అయితే దత్తాత్రేయ హొసబలె వ్యాఖ్యలను బీజేపీ నేతలు వెనకేసుకొస్తున్నారు. భారత్ అని పిలవడంలో ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదన్నారు. భారత్ అని పేరు మార్చడం వల్ల మన దేశ ఉన్నత సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పవచ్చంటున్నారు బీజేపీ నేతలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..