YSR Crop Insurance Funds: రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్.. ఉచిత పంట బీమా పథకం కింద నిధుల విడుదల
ఇవాళ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద చెల్లింపులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్లు జమ చేశారు.
AP CM YS Jagan released YSR Crop Insurance Funds: రైతులు, రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని, రైతు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇవాళ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద చెల్లింపులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఖరీఫ్-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి పంట బీమా నగదు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టామని, వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈనెలలోనే రైతు భరోసా కింద సుమారు 3,900 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 శాతానికిపైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. అలాగే, 2018-19 ఇన్సూరెన్స్ బకాయిలను కూడా రూ. 715 కోట్లు విడుదల చేశామని, 2019-20 ఉచిత పంటల బీమా పరిహారంగా మరో రూ.1253 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీలను నిర్లక్ష్యం చేశాయన్నారు.
పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదని, తాము వచ్చాక ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులపై భారం పడకుండా పంటల బీమాని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. 23 నెలల కాలంలో రైతుల కోసం రూ.83వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామని, గ్రామ సచివాలయాలతోపాటు 10,778 ఆర్‌బీకేలు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
Also Read: