AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rush to Aadhaar Centres: ‘చేయూత’ కోసం మహిళల అవస్థలు.. ఆధార్‌ కేంద్రాల వద్ద పడిగాపులు.. కనిపించని కోవిడ్ రూల్స్

కరోనా టైంలో భారీగా మహిళలు.. ఆధార్‌లో తప్పులు సరిదిద్దుకోవడానికే ఆ క్యూ లైన్లు. ఎక్కడ వెనుకబడిపోతామో అని నిద్రాహారాలు మానేసి క్యూ కడుతున్నారు జనం.

Rush to Aadhaar Centres: ‘చేయూత’ కోసం మహిళల అవస్థలు..  ఆధార్‌ కేంద్రాల వద్ద పడిగాపులు.. కనిపించని కోవిడ్ రూల్స్
Women Rush To Aadhaar Centres
Balaraju Goud
|

Updated on: May 25, 2021 | 12:22 PM

Share

Women Rush to Aadhaar centres: కరోనా టైంలో భారీగా మహిళలు.. వ్యాక్సిన్ కోసమో… కరోనా మందు కోసమో కాదు. ఆధార్‌లో తప్పులు సరిదిద్దుకోవడానికే ఆ క్యూ లైన్లు. ఎక్కడ వెనుకబడిపోతామో అని నిద్రాహారాలు మానేసి క్యూ కడుతున్నారు జనం.

సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటేనే నగదు జమ అవుతోంది. అదేసమయంలో ఫోన్‌ నెంబర్‌ను కూడా ప్రమాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యం లోనే ఇటీవల చేయూత పథకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పథకం కింద బీసీ వర్గానికి చెందిన మహిళలకు రూ.15వేల బ్యాంకులో జమ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ దరఖాస్తుతో పాటు ఆధార్‌ హిస్టరీని కూడా జతచేయాలన్న నిబంధన విధించింది. దీంతో మహిళలు ఆధార్‌ కేంద్రాలకు పరుగులు తీస్తుండటంతో వాటి వద్ద రద్దీ పెరిగింది. ఆధార్‌ కేంద్రాలు పరిమితంగా ఉండటం, రోజుకు 40 కార్డులకు మించి సవరణలు చేయలేకపోతుండటంతో మహిళలు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సివస్తోంది.

ఇదేక్రమంలో ఆధార్‌లో తప్పుల సవరణ, ఫోన్ నెంబర్‌తో అటాచ్‌మెంట్‌ గుంటూరు జిల్లా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. చిన్న చిన్న మార్పుల కోసం క్యూ కట్టాల్సి వస్తోంది. తప్పులు సరిదిద్దుకోకుంటే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. తెనాలి, తాడికొండలోని ఆధార్ కేంద్రాల వద్ద దుస్థితి చూస్తే అయ్యో పాపం అనక తప్పదు. నిద్రాహారాలు మానేసి.. ఇంటి వద్ద పనులన్నీ అపేసి ఇలా వరుసల్లో వచ్చి నిల్చుంటున్నారు మహిళలు.

ఇలా నిల్చున్న మాత్రాన పని అయిపోవడం లేదు. ఈ క్యూలన్నీ కూడా వాళ్లు ఇచ్చే టోకెన్ల కోసం. ఆ టోకెన్‌లో టైం, డేట్ రాసి ఇస్తారు. మళ్లీ అప్పుడు వచ్చి ఆధార్‌ కార్డులో తప్పులు సరిదిద్దించుకోవాలి. రోజుకు 40 ఆధార్‌ కార్డుల కంటే ఎక్కువ కరెక్షన్ చేయలేమని అందుకే ఈ సమస్య వస్తోందని అంటున్నారు ఆధార్‌ సెంటర్‌ నిర్వహకులు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సవరణలు చేస్తున్నామంటున్నారు.

ఇలా టోకెన్ల కోసం వస్తున్న వాళ్లు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. ఫిజికల్ డిస్టెన్స్ ఏమాత్రం కనిపించడం లేదు. కొందరు మాస్కులు ఇష్టారాజ్యంగా పెట్టుకొని కనిపిస్తున్నారు. కొవిడ్ నిబంధలు అసలు అమలు కావడంలేదు. వైరస్‌ ఉద్ధృతి విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో ఈ సీన్స్ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి ఇలా ఉంటే… చిన్న చిన్న కరెక్షన్లు, ఫోన్ నెంబర్‌ అటాచ్‌మెంట్‌ కోసం ఆధార్‌ కేంద్రం వాళ్లు భారీగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎలాంటి కరెక్షన్ అయినా రూ.100 తక్కువ తీసుకోవడం లేదని వాపోతున్నారు ప్రజలు.

అటు, ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఎస్‌బీఐ(ఏడీబీ), ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లలో ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయి. అద్దంకి పట్టణం, మండలంతోపాటు దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి మహిళలు ఉదయం 6 గంటలకే ఆయా కేంద్రాల వద్దకు వచ్చి వేచి ఉంటున్నారు. ఇక మార్టూరు మండలం నుంచి బల్లికురవ మండలం వి.కొప్పెరపాడు, గుంటూరు జిల్లా చిలకలూరి పేట తదితర ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఆధార్‌ కేంద్రాల వద్ద మహిళలు కనీసం భౌతికదూరం కూడా పాటించకుండా గుంపులు గుంపులుగా ఉండటంతో కరోనా వ్యాప్తిచెందుతుందన్న ఆందోళన కూడా నెలకొంది.

మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలోనూ అదే పరిస్థితి.. పాలకొండ పట్టణంలోని ఆధార్ కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకంలో భాగంగా.. కొత్తగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టడంతో మహిళలు ఆధార్ కార్డులను నవీకరించుకునేందుకు బారులు తీరారు. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కేంద్రం వద్ద నిరీక్షించారు. ఇప్పటికే పట్టణంలో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో.. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.