AP Capitals: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు కాదు.. ఏకంగా ముప్పై మూడంటూ జోరుగా ప్రచారం.. ఇది నిజం!

కర్నూలు, విశాఖ వాసులు మూడు రాజధానుల ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేస్తుంటే.. విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంత వాసులు వ్యతికిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి మూడు కాదు ఏకంగా ముప్పైమూడు రాజధానులంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో...

AP Capitals: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు కాదు.. ఏకంగా ముప్పై మూడంటూ జోరుగా ప్రచారం.. ఇది నిజం!
Andhrapradesh

AP Capitals totally thirty three: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పట్నించి దానిపై పెద్ద చర్చే జరిగింది. మూడు రాజధానులను స్వాగతించిన వారూ వున్నారు. తీవ్రంగా వ్యతిరేకించిన వారూ వున్నారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులైతే ఏకంగా సంవత్సరాల తరబడి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒక్క అధికార వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు సైతం మూడు రాజధానుల ప్రాతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్నూలు, విశాఖ వాసులు మూడు రాజధానుల ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేస్తుంటే.. విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంత వాసులు వ్యతికిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీకి మూడు కాదు ఏకంగా ముప్పైమూడు రాజధానులంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఏపీలో ప్రాంతానికో స్పెషాలిటీ వుంది. జిల్లాకో ప్రత్యేకత వుంది. కొన్ని పట్టణాలు కూడా ప్రత్యేకతలను కలిగి వున్నాయి. ఆ కోణంలో ఒక్కో స్పెషాలిటీ కలిగిన జనావాసాన్ని ఒక్కో రాజధానిగా పేర్కొన్నారు సర్క్యులేట్ అవుతున్న ఈ మెసేజ్‌లో.. కేవలం తెలుగు ప్రజలకే కాకుండా యావత్ దేశ హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమలేశుని సన్నిధి కలిగిన తిరుపతిని ఏపీ అధ్యాత్మిక రాజధానిగా పేర్కొన్నారు. ఊటీని తలపించే ప్రకృతి అందాలను కలిగి వున్న అరకు వ్యాలీని ఏపీ అందాల రాజధానిగా ప్రస్తావించారు. రకరకాల మామిడి పళ్ళకు ప్రసిద్ది గాంచిన నూజివీడును మామిడికాయల రాజధానిగా అంటున్నారు. కొబ్బరి తోటలతోను, కోనసీమ అందాలతో కలగలిసిన అమలాపురాన్ని కొబ్బరికాయల రాజధానిగా ఈ మెసేజ్‌లో పిలుచుకుంటున్నారు.

Capitals

Capitals

చూడగానే నోరూరించి.. నోట్లో వేయగానే కరిగిపోయే పూతరేకులకు ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురాన్ని పూతరేకుల రాజధానిగా పిలుచుకుంటున్నారు. ఇక కాజాలకు ప్రసిద్ది గాంచిన కాకినాడను కాజాల రాజధానిగాను.. మడత కాజాలకు పేరుగాంచిన తాపేశ్వరాన్ని మడతకాజాల రాజధానిగాను ప్రస్తావించారందులో. తొక్కుడు లడ్డుకు పేరుగాంచిన బందరును తొక్కుడు లడ్డు రాజధానిగాను.. ఘాటైన మిరపకాయలకు పేరెన్నిక గన్న గుంటూరును మిరపకారం రాజధానిగాను, ఘనమైన విద్యాసంస్థలకు కేంద్రమైన విజయవాడను విద్యా రాజధానిగాను పిలుస్తున్నారు.

సుందరమైన బొమ్మలకు నెలవైన కొండపల్లిని బొమ్మల రాజధానిగాను, పొగరైన గిత్తలతో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఒంగోలును గిత్తల రాజధానిగాను చెబుతున్నారు. మూత్రపిండాల వ్యాధులతో యావత్ దేశం జాలిని పొందిన ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధుల రాజధానిగాను, పలాసను జీడిపప్పు రాజధానిగాను పేర్కొన్నారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు వార్తలకెక్కే భీమవరాన్ని కోడిపందాల రాజధానిగా చెబుతున్నారు. గుడివాడను ఎడ్లపందాల రాజధానిగా పిలుస్తున్నారు. కరవు రాజధానిగా అనంతపురాన్ని, తుఫాన్ల రాజధానిగా దివిసీమను, క్రీస్తు రాజధానిగా ఇడుపుల పాయను, విమానాశ్రయ రాజధానిగా గన్నవరాన్ని, రోజ్ మిల్క్ రాజధానిగా రాజమహేంద్రవరాన్ని, అరటిపళ్ళ రాజధానిగా రావుల పాలేన్ని పేర్కొన్న ఈ మెసేజ్ ఇపుడు తెగ ట్రెండ్ అవుతోంది.

ఇక త్వరలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాబోతున్న విశాఖపట్నాన్ని ఈ మెసేజ్‌లో హార్బర్ రాజధానిగా పేర్కొనడం విశేషం. నాటకాల రాజధానిగా చిలకలూరిపేటను, ఫ్యాక్షన్ రాజధానిగా పులివెందులను, బెట్టింగ్ రాజధానిగా నెల్లూరును, కళల రాజధానిగా కూచిపూడిని, వస్త్ర వ్యాపార రాజధానిగా చీరాలను పిలుచుకుంటున్నారు. చేపల రాజధానిగా సూర్యలంకను, బెల్లం రాజధానిగా అనకాపల్లిని, పసుపు రాజధానిగా దుగ్గిరాలను, ఆంధ్రాప్యారిస్ రాజధానిగా తెనాలిని పేర్కొంటూ.. మొత్తమ్మీద ఏపీకి 33 రాజధానులంటూ ఫన్నీగా రాసిన ఈ మెసేజ్ ఇపుడు ఏపీలోను కాదు ఇటు తెలంగాణలోను బాగా సర్క్యులేట్ అవుతోంది. ఈ మెసేజ్ చదువుకున్న వారు రాజకీయాలను మరిచి హాయిగా నవ్వుకుంటున్నారు.

ALSO READ: పంజాబ్‌లో కొత్త పొత్తు.. బీజేపీకి షాకిచ్చిన శిరోమణి అకాలీదళ్.. మాయావతి రీఎంట్రీ?

ALSO READ: బెజవాడలో భారీ ‘రియల్’ మోసం.. లబోదిబో మంటున్న ఏజెంట్లు, బాధితులు

ALSO READ: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలి.. కేంద్రాన్ని కోరిన జీఎస్టీ కౌన్సిల్