ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఆ ఇంటి సొంతం.. పదహారు మంది ముఖ్యమంత్రులకు ఆతిథ్యం.. ఏపీలోని..
ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఆ ఇంటి సొంతం.. స్వాతంత్ర్యానికి తొమ్మిదేళ్లకు ముందే నిర్మాణం పూర్తి చేసుకున్న భవనం అది. ఎందరో రాజకీయ నాయకులకు..
ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఆ ఇంటి సొంతం.. స్వాతంత్ర్యానికి తొమ్మిదేళ్లకు ముందే నిర్మాణం పూర్తి చేసుకున్న భవనం అది. ఎందరో రాజకీయ నాయకులకు అండదండలందించిన నివాసం అది. పదహారు మంది ముఖ్యమంత్రులకు ఆతిథ్యం ఇచ్చిన గృహం.. ఐదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ ఇంటి నుంచే చక్రం తిప్పారు. ఎవరిదా ఇళ్లు.. దాని విశిష్టత ఏంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అందెవేసిన చెయ్యి. ఏడేళ్లు ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకూ ఏ కాంగ్రెస్ నేత ఆ చరిత్రను తిరగ రాయలేకపోయారు. అలాగే గుంటూరు జిల్లా నర్సారావు పేటలో కాసు వారి ఇల్లు కూడా అంతటి పేరు ప్రఖ్యాతలు గాంచింది. 1938లో కాసు బ్రహ్మానంద రెడ్డి సోదరుడు వెంకట రెడ్డి నర్సారావుపేట ప్రకాష్ నగర్‌లో ఎకరం స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆ ఇంటి నుంచే వెంకట రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత ఆ కుటుంబంలోని వెంగళ రెడ్డి ఎమ్మెల్సీగా పని చేయగా.. బ్రహ్మానంద రెడ్డి, కాసు కృష్ణా రెడ్డి, మహేష్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నర్సారావుపేట రాజకీయాలతో కాసు కుటుంబానికి విడదీయరాని సంబంధం ఉంది. ఎంతో మంది నేతలు పల్నాడు వచ్చినప్పుడు కాసు ఇంటిలోనూ ఉండేవారు. కాసు వారి ఆతిథ్యం స్వీకరించేవారు. నర్సారావుపేట రైలు కట్ట పక్కనే ఇళ్లు ఉండటంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ సైతం వీరి ఇంటి ముందే ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి ఎవరు వచ్చినా ఆ ఇంటి ఆతిథ్యం స్వీకరించాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో గత ఎనభై ఏళ్లులో ముఖ్యమంత్రలుగా ప ని చేసి పదహారు మంది ఆ ఇంటికొచ్చిన వారే. ఆతిథ్యం స్వీకరించినవారే. అప్పటి టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి నేటి జగన్ మోహన్ రెడ్డి వరకు కాసు వారి ఇంటికి ముఖ్య అతిథుగా వచ్చిన వారే. కొంతమంది ముఖ్యమంత్రి హోదాలో ఆ ఇంట్లోకి అడుగుపెడితే.. మరికొంత మంది ప్రతిపక్ష నేతలు, మంత్రులుగా ఆ ఇంటికొచ్చారు. అప్పటి నుంచి భౌతికంగా పెద్ద మార్పులు చేయకుండానే ఆ భవనాన్ని అలా కొనసాగిస్తు్న్నారు. ఎకరం విస్తీర్ణంలో అర ఎకరంలోనే నిర్మాణాలు ఉన్నాయి. మిగిలిన స్థంలో పెద్ద పెద్ద వృక్షాలు, పూల మొక్కలతో పాటు పండ్ల చెట్లను ఇప్పటికీ పెంచుతున్నారు. మూడు బెడ్ రూమ్‌లతో ఏర్పాటు చేసిన ఈ ఇంట్లో.. పది మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసే విధంగా అప్పటి రోజుల్లోనే ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్ ఉంది.
ఈ మధ్య కాలంలో కాసు కుటుంబం హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ.. నర్సారావుపేట ఇంటిపై మాత్రం వారి మక్కువ చెదరలేదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా చేసిన ప్రకాశం పంతులు, అంజయ్య, దామోదరం సంజీవయ్య, బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు.. కిరణ్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, జగన్ హోహన్ రెడ్డి కూడా ఆ ఇంటికి వచ్చి కాసు వారి ఆతిథ్యం స్వీకరించారు. 1936లో ఉప్పలపాడు నుంచి వెళ్లిన కూలీలు ఇంటి నిర్మాణంలో పాల్గొన్నారని, ఎన్నో రాజకీయ కార్యక్రమాలకు ఆ ఇల్లు నెలవుగా మారిందని నాటి తరం కాసు కుటంబ అనుచరులు చెప్పారు.
గత ఇరవై ఏళ్లుగా ఆ ఇంట్లోనే పని చేస్తున్నానని, గతంలో ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉందని కాసు కుటుంబ అనుచరులు వెంకట్రావు చెప్పాడు. ‘ఇంట్లో ఇప్పటికీ ఆనాటి ఫర్నీచర్ మనకు కనిస్తోంది. హాల్‌లో ఉండే వినాయకుడి చెక్క విగ్రహం అందరినీ కట్టిపడేస్తోంది. కుర్చీలు, సోఫాలు ఇప్పటికీ వినియోగంలో ఉననాయి. ఆనాడు కట్టిన డైనింగ్ హాలే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేశారు. ఇంట్లో ఉన్న మొక్కలను అపురూపంగా చూస్తుంటారు. నిర్వాహకులగా తాము కూడా ఆ మొక్కలు, చెట్లను పెంచడంపై శ్రద్ధ పెడతాం’ అని వెంకట్రావు చెప్పుకొచ్చాడు.
తమ తాతల కాలం నాటి నుంచి ఇప్పటి వరకూ వారసత్వంగా వచ్చిన ఇంట్లోనే ఇప్పటికీ నివసిస్తున్నట్లు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ చెప్పారు. ఎంతోమంది రాజకీయ ఉద్దండులు తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారని, అయితే నర్సారావుపేట ప్రాంత ప్రజల ఆదరాభిమానాలు, దేవుడి దయ వల్లే తమకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు. ఎనభై ఏళ్ల క్రితమే నిర్మించిన ఈ ఇంటిలో చిన్న చిన్న మార్పులు తప్ప అదేవిధంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ రుణ పడి ఉంటామన్నారు. ఎందరో రాజకీయ ఉద్దండులు తమ ఇంటి ఆతిథ్యం స్వీకరించారని మహేష్ రెడ్డి తెలిపారు.
నగరాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న కొద్ది కాలానికే తమ గ్రామాలను, ఊర్లను మరిచిపోతున్న ఈ రోజుల్లో ఇంకా ఎనభై ఏళ్ల నాటి గృహాన్ని అలాగే ఉంచడాన్ని స్థానికులు గొప్పగా చెప్పుకుంటున్నారు.