Big cheating: బెజవాడలో భారీ ‘రియల్’ మోసం.. లబోదిబో మంటున్న ఏజెంట్లు, బాధితులు
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని బెజవాడలో ఓ భారీ ‘రియల్ ఎస్టేట్’ మోసం వెలుగు చూసింది. భారీ వెంచర్ల పేరిట నానా హంగామా చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా బోర్డు తిప్పేసింది. కొనుగోలుదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేసింది.
Big cheating in Vijayawada city: ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని బెజవాడలో ఓ భారీ ‘రియల్ ఎస్టేట్’ మోసం వెలుగు చూసింది. భారీ వెంచర్ల పేరిట నానా హంగామా చేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా బోర్డు తిప్పేసింది. కొనుగోలుదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టేసింది. బాధితులు, ఏజెంట్లు పోలో మంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది. ఈ చీటింగ్ వ్యవహారం ఇపుడు విజయవాడలో కలకలం రేపుతోంది. విజయవాడతోపాటు హైదరాబాద్‌లోను కార్యాలయాలను కలిగి వున్న ఎంకే రియల్ డెవలపర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ మేరకు పలువురు బాధితులు విజయవాడ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు వెంచర్లపై ప్రచారం చేసుకున్న ఎంకే రియల్ డెవలపర్సర్ నిర్మాణాలు, ప్లాట్ల అమ్మకం పేరిట ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్ళకు పాల్పడింది. కొనుగోలు దారులు తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని కోరడంతో సంస్థ బోర్డు తిప్పేసింది. కంపెనీ బాధ్యులు ఫోన్లెత్తకుండా మాయమవడంతో ఏజెంట్లు పరేషాన్‌లో పడ్డారు.
ఈ మేరకు ఎంకే కంపెనీపై బెజవాడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. రాజమండ్రికి చెందిన పట్నాల శ్రీనివాసరావు 2020 ఆగస్టులో గురునానక్ కాలనీలో ఎంకే రియల్ డెవలపర్స్ పేరిట కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కంపెనీకి ఛైర్మెన్‌గా ఉప్పు మనోజ్ కుమార్ వ్యవహరించారని, డైరెక్టర్ బలగం రవితేజ వుండేవారని బాధితులు చెబుతున్నారు. ఏజంట్ల ద్వారా నిర్మాణాలు, ఫ్లాట్లు అమ్మకం పేరిట అడ్వాన్సులు వసూలు చేసి.. తాజాగా బోర్డు తిప్పేసినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరిట సుమారు 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. బాధితుల్లో విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖకు చెందిన వారున్నారు. వీరంతా ఏజెంట్లపై ఒత్తిడి తీసుకురావడంతో వారు విజయవాడ పటమట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు.
ALSO READ: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయాలి.. కేంద్రాన్ని కోరిన జీఎస్టీ కౌన్సిల్