ఏపీలో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ గడువు.. మరికాసేపట్లో పోటీలోని అభ్యర్థుల తుది జాబితా ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ రచ్చ రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య వైరంతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ నేటితో ముగుస్తండటంతో ఉత్కంఠ నెలకొంది.

  • Balaraju Goud
  • Publish Date - 5:24 pm, Wed, 3 March 21
ఏపీలో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ గడువు.. మరికాసేపట్లో పోటీలోని అభ్యర్థుల తుది జాబితా ప్రకటన

AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ రచ్చ రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య వైరంతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ నేటితో ముగుస్తండటంతో ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఏకగ్రీవాలు.. అభ్యర్థుల జంపింగ్‌లతో మున్సిపోల్స్‌ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు నానా తంటాలు పడింది తెలుగుదేశం పార్టీ. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు వైసీపీకి జై కొట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల ప్రమేయం లేకుండానే ఇతర వ్యక్తులే బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.

ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు పిడుగురాళ్లలో 33 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డుల్లో వైసీపీ, పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవం అయ్యాయి. చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణలో పలుచోట్ల గొడవలు జరిగాయి. పలమనేరు మున్సిపాలిటీలో నామినేషన్ల విత్ డ్రా విషయంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

మరోవైపు, తమ అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో కీలక ప్రకటన చేశారు. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు బలవంతపు ఉపసంహరణలను ఆమోదించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. విత్ డ్రా చేసుకునే అభ్యర్థి స్వయంగా వస్తే తప్ప.. ఇతరుల జోక్యానాని పట్టించుకోవద్దని స్పష్టం చేశారు.ఈ అదేశాలను జిల్లా కలెక్టర్లతో పాటు ఎన్నికల అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తప్పకుండా పాటించాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు

ఇదిలావుంటే, బెదిరింపుల వల్ల నామినేషన్లు విత్ డ్రా చేసుకున్న ఆరోపణలపై స్పందించిన ఆయన.. రీ నామినేషన్లకు అవకాశం కల్పించారు. ఈ ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు, ఈ నెల 1 నుంచి 31 వరకు సెలవుపై వెళ్లిన కడప జిల్లా ప్రొద్దటూరు మున్సిపల్ కమిషనర్‌కు లీవ్ మంజూరు చేస్తూ ఆయన స్థానంలో మరో అధికారిని నియమించినట్లు నిమ్మగడ్డ తెలిపారు.

మరి కాసేపట్లో పోటీలోని అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 కార్పొరేషన్ల పరిధిలోని 671 డివిజన్లు.. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 2,123 వార్డులకు నామినేషన్ ప్రక్రియ గతేడాది మార్చిలోనే ముగిసింది. దీనికి సంబంధించిన నామినేషన్లు ఉపసంహరణ ప్రక్రియ ఈ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది.

ఈనెల 10న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా.. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విశాఖ, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం నగరపాలికలతో పాటు 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండిః  ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దేశద్రోహమవుతుందా ? సుప్రీంకోర్టు, ‘పిల్’ కొట్టివేత