AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖలో టీడీపీకి షాక్.. ఎమెల్యే గంటా శ్రీనివాసరావు కీలక అనుచరుడికి వైసీపీ తీర్థం

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ తమ వ్యూహాలకు పదును పెంచింది. ఇంతకాలం ఆపరేషన్‌ ఆకర్ష్‌ను దూరం పెట్టిన వైసీపీ తాజాగా టీడీపీ లోని కీలక..

విశాఖలో టీడీపీకి షాక్.. ఎమెల్యే గంటా శ్రీనివాసరావు కీలక అనుచరుడికి వైసీపీ తీర్థం
K Sammaiah
|

Updated on: Mar 03, 2021 | 5:20 PM

Share

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ తమ వ్యూహాలకు పదును పెంచింది. ఇంతకాలం ఆపరేషన్‌ ఆకర్ష్‌ను దూరం పెట్టిన వైసీపీ తాజాగా టీడీపీ లోని కీలక నేతలపై కన్నేసింది. విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుపరిపాలన చూసి కాశీ విశ్వనాథ్‌ వైఎస్సార్‌ సీపీలో చేరారన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ప్రజలు అధికార పార్టీకి పట్టం కట్టారని, విశాఖ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితమే కాశీ పార్టీలో చేరాల్సింది. కొన్ని కారణాలు వలన అవ్వలేదు. జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులందరు కాశిని పార్టిలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకొని జీవిఎంసి ఎన్నికల్లో విజయం సాధించాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇక కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. టిడిపిలో చాలా ఇబ్బందులు పడ్డాను. పలు పదవులు ఆశ చూపి, ఆఖరికి అన్యాయం చేశారు. గడిచిన రెండు సంవత్సరాలుగా రాజకియాలకు దూరంగా ఉన్నాను. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ఆకర్షితుడునై వైఎస్సార్‌ సీపీలో చేరాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ గెలుపే దిశగా చిత్తశుద్ధితో పని చేస్తానని అన్నారు.

అయితే గతంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. వైసీపీలోకి గంటా శ్రీనివాస్‌ చేరిపోవడం ఖాయమనే అంతా భావించారు. వైసీపీలో గంటా చేరికకు ఆగస్టు 16న ముహుర్తం కూడా కుదిరింది. వాస్తవానికి ఆయన అదే రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి వైసీపీకి మద్దతు ప్రకటిస్తారని భావించినా అలా జరగలేదు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన మౌనంగానే ఉంటున్నారు. అలాగని టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అంటే అదీ లేదు. ఇతర ఎమ్మెల్యేల్లా విమర్శలు చేస్తున్నారా అంటే అదీ కాదు. దీంతో రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన గంటా మనసులో మరో ప్లాన్‌ ఏదో రెడీ అవుతోందనే ప్రచారం జోరుగా సాగింది.

గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రస్తుతం ఎమ్మెల్యేల అవసరం లేదు. అయినప్పటికీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా గంటా శ్రీనివాసరావు కోసం తీవ్రంగా ప్రయత్నించింది. ఓ దశలో వైసీపీలోకి గంటా చేరిక లాంఛనమేనని అంతా భావించారు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఇక రాజకీయాలెందుకు అన్న చందాన చివరి నిమిషంలో ఈ ఎంట్రీకి బ్రేక్‌ పడిపోయింది. ఈ బ్రేక్‌ వైసీపీ వేసిందా లేక తనంతట తానుగా గంటా వేసుకున్నారా తెలియదు కానీ మొత్తానికి ఆయన వైసీపీలోకి రావడం తృటిలో తప్పిపోయింది. దీంతో అప్పటికే విశాఖలో ఆయన ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకించిన నేతలంతా కామ్‌ అయి పోయారు.

ఇక తాజాగా గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ వైసీపీలోకి రావడం ఆసక్తికరంగా మారింది. గంటా అనుమతి లేనిది ఆయన ఇంతటి కీలక నిర్ణయం తీసుకుని ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇటీవల విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే గంటా కీలక అనుచరుడు వైసీపీలో చేరడం ఆసక్తిగా మారింది. దీనిపై గంటా శ్రీనివాసరావు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Read More:

సీపీఎంతోనే ప్రజల అజెండా అమలు.. విజయవాడను అభివృద్ధి చేసిన ఘనత సీపీఎం వామపక్ష పార్టీలదే -సీహెచ్‌ బాబూరావు