ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా కట్.. హైకోర్టు సంచలన ఆదేశాలు!
ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ట్రాఫిక్ నిబంధనల అమలుపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరణాల సంఖ్య రోజుకి పెరిగిపోతుంటే, పోలీసులు ఏం చేస్తున్నారంటే ప్రశ్నించింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే 600 మందికి పైగా చనిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాలు నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ఎలాంటి పరిస్థితులు రావని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీరియస్ అయింది.
కేంద్ర మోటార్ వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం లేదంటూ న్యాయవాది యోగేష్ వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, కొన్ని విషయాలను ప్రశ్నిస్తూ పోలీసులపై సీరియస్ అయింది. ఎవరైనా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే గనుక కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. ఒకవేళ పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టకపోతే వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపేయాలని సూచించింది.
వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇక ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని, కానీ ఏపీలో మాత్రం నిబంధనలను ఎవరూ పాటించడం లేదని పిటిషన్ పేర్కొన్నారు. అద్దాలకు నల్ల ఫిలిమ్ ఉన్న కార్లు హైదరాబాద్‌లో కనిపించవు. కానీ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇందుకు చట్ట నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడమే కారణం అంటూ పిటిషన్ వేసిన న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం వైపు తరపు న్యాయవాది చలాన్లు, తనిఖీలు అన్ని చేస్తున్నామని సమాధానం చెప్పినప్పటికీ, జరిగిన ఘటనల్లో హెల్మెట్ లేకుండా చనిపోయిన వారే చాలామంది ఉన్నారని హైకోర్టు దృష్టికి రావడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.
హైకోర్టు హెల్మెట్ తప్పనిసరి చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన జూన్ 26 నుండి సెప్టెంబర్ 4 మధ్య 666 మంది చనిపోవడం చిన్న విషయం ఏమీ కాదంటూ ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. హెల్మెట్ లేకుండా ఎవరు కనిపించిన ఉపేక్షించొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు నిబంధనలను కఠినంగా అమలు చేయాలని లేని పక్షంలో మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని కేవలం మూడు నెలల్లో ఇన్ని మరణాలు ఎలా అంటూ ప్రశ్నించింది. చలానాలు చెల్లించుకుంటే వాహనాలు సీజ్ చేసేందుకు చట్ట నిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ అలా చేయకుండా ఎవరు ఆపారంటూ ఆర్టీఏ అధికారులను సైతం హైకోర్టు ప్రశ్నించింది.
అధిక జరిమానాలు విధించడం వల్ల సమస్యకు పరిష్కారం దొరక్కపోగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ప్రస్తుతం విధిస్తున్న జరిమానాలనే కఠినంగా అమలు చేస్తే సరిపోతుందని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణలో ట్రాఫిక్ ఐజీని హైకోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేశారు. యాక్సిడెంట్స్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..