- Telugu News Spiritual Chakrateertha Mukkoti held in grand scale in Tirumala Tirupati, know importance and significance of it
Tirumala: తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి.. చూసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం
కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల క్షేత్రం నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుంది. తిరుమలలో అనేక పవిత్ర ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి ఉత్సవాల్లో ఒకటి చక్రతీర్థ ముక్కోటి. తిరుమల గిరుల్లో కుమారధార, ఆకాశగంగ, పాపవినాశనం, చక్ర తీర్థం వంటి ఎన్నో పవిత్ర తీర్ధాలున్నాయి. ఈ తీర్థాలకు ఏటా ముక్కోటి ఉత్సవం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు చక్రతీర్థ ముక్కోటి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Updated on: Dec 12, 2024 | 3:41 PM

మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున చక్రతీర్థ ముక్కోటి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు.

శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హారతులిచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడు. అందుకు సంతోషించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మహావిష్ణువు ఆతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు.

పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకరోజు రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరిస్తాడు.

ఆ తరువాత మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఆనాటి నుంచి సుదర్శన చక్రం అక్కడే శాశ్వతంగా ఉండిపోయింది. ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది.

వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసి వున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా భాసిల్లుతోంది. ఈ మేరకు ఏటా టీటీడీ అనవాయితీ గా చక్రతీర్థం ముక్కోటిని ఈరోజు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ఈ చక్ర తీర్థ ముక్కోటి వేడుకలను చూసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం. చక్రతీర్థ ముక్కోటి రోజు మాత్రమే కాదు శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు తప్పనిసరిగా చక్ర తీర్థాన్ని దర్శించి తరిస్తుంటారు.




