AP – Telangana: హైదరాబాద్‌లో అతిపెద్ద సేఫ్టీ సెంటర్.. AP యువతకు నైపుణ్య శిక్షణ
తెలుగు రాష్ట్రాలతో గూగుల్ కీలక ఒప్పందాలు చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు ఏపీ ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం AP యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతోంది. అలాగే.. దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇంతకీ.. ఈ గూగుల్ సేఫ్టీ సెంటర్ ఉపయోగాలేంటి?.. ఏపీలో ఎలాంటి ఆవిష్కరణలు చేయబోతోంది?...
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దాని ద్వారా ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్ధులకూ నైపుణ్యాల శిక్షణ కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే.. గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం మరో డీల్ చేసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా ఏపీ విద్యార్ధులకు అవకాశాలు అందించేలా మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో ఒప్పందం కుదుర్చుకున్నారు గూగుల్ ప్రతినిధులు. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం ఏపీ యువతకు గూగుల్ నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు సహకరించనుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి లోకేశ్. యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10 వేల మందికి గూగుల్ ఎసెన్సిషియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుందన్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఏఐ వంటి రంగాల్లో గూగుల్ క్లౌడ్ సర్టిఫికేషన్‌లు, స్కిల్ బ్యాడ్జ్‌లను గూగుల్ అందజేస్తుందన్నారు మంత్రి లోకేశ్. ఒప్పందానికి ముందు.. సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు గూగుల్ క్లౌడ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ ఎండీ బిక్రమ్ సింగ్ బేడీ. గూగుల్, ఏపీ ప్రభుత్వ ఒప్పందం ఒక గొప్ప ముందడుగు అన్నారు సీఎం చంద్రబాబు.
హైదరాబాద్‌లో దేశంలోనే తొలి గూగుల్ సేఫ్టీ సెంటర్
మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వంతోనూ గూగుల్ కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో జపాన్ తర్వాత రెండో సెంటర్‌గా గుర్తింపు పొందబోతోంది. దీనికి సంబంధించి గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ నేతృత్వంలోని ప్రతినిధులు రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు చేశారు. హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండడం గర్వంగా ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌లో హైదరాబాద్ లీడర్ అని నిరూపించేందుకు ఈ ఒప్పందమే నిదర్శనమని చెప్పారు. డిజిటల్ స్కిల్ డెవలప్మెంట్లో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఐటీ, ఐటీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ప్రపంచ దేశాలకు హైదరాబాద్ గమ్య స్థానమని స్పష్టం చేశారు. అటు.. అత్యాధునిక పరిశోధనతోపాటు ఏఐ టెక్నాలజీ ఆధారంగా సైబర్ సెక్యూరిటీకి గూగుల్ సేఫ్టీ సెంటర్ పరిష్కారాలు చూపిస్తుందన్నారు గూగుల్ ప్రతినిధులు. మొత్తంగా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో గూగుల్ కీలక ఒప్పందం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి