Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konijeti Rosaiah: బడ్జెట్‌ కూర్పులో ఘనాపాటి.. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రాజకీయ ప్రస్థానం..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం​ బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Konijeti Rosaiah: బడ్జెట్‌ కూర్పులో ఘనాపాటి.. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రాజకీయ ప్రస్థానం..!
Rosaiah.2
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 04, 2021 | 9:52 AM

Konijeti Rosaiah Political Carrier: ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం​ బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ రూపొందించడంలో రోశయ్య ఘనాపాటి. ఆర్థిక అపర చాణక్యుడిగా రోశయ్య తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆయన మీద నమ్మకం.. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆర్ధిక బాధ్యతలు అప్పగించారు. శాసనసభలో వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రోశయ్య రికార్డ్ సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘంగా సేవలు అందించారు రోశయ్య. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పడంలో రోశయ్య స్టైలేవేరు. నిరాధార ఆరోపణలు చేసే ప్రతిపక్ష నేతలకు.. గట్టిగానే సమాధానం చెప్పగల నేర్పరి.

రోశయ్య ప్రస్థానాన్ని పరిశీలిస్తే… కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004లో చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.

బడ్జెట్‌లో ఘనాపాటి ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఇప్పటికి 15 సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం.. 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.

❀1968-85: శాసనమండలి సభ్యుడు ❀1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత ❀1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి ❀1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు ❀1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి ❀2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు ❀2004: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి ❀2009: రాష్ట్ర శాసనమండలి సభ్యుడు ❀2009: సెప్టెంబరు – 2010 నవంబరు 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ❀2011: ఆగస్టు 31: తమిళనాడు గవర్నర్‌