AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘ఏపీ వదిలేసి తెలంగాణకు వచ్చేస్తా’.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్..

సీమలో కరువుకు, కష్టాలకు చెక్.. చిటికెలో సమస్యకు పరిష్కారం.. ఇదిగో జేసీ ఫార్ములా. అవును.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుదుపు తీసుకొచ్చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. తొమ్మిదేళ్ల కిందటి ఫ్లాష్‌బ్యాక్‌ని తవ్వుకుని, దానిక్కాస్త కొత్త కలరింగ్ ఇచ్చి.. సరికొత్తగా తెర మీదికి తీసుకొచ్చేశారు. టైటిల్ పాతదే.. రాయల తెలంగాణా. స్క్రీన్‌ప్లే ఒక్కటే మారింది.

Andhra Pradesh: ‘ఏపీ వదిలేసి తెలంగాణకు వచ్చేస్తా’.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్..
Jc Diwakar Reddy
Shiva Prajapati
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 25, 2023 | 3:51 PM

Share

సీమలో కరువుకు, కష్టాలకు చెక్.. చిటికెలో సమస్యకు పరిష్కారం.. ఇదిగో జేసీ ఫార్ములా. అవును.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుదుపు తీసుకొచ్చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. తొమ్మిదేళ్ల కిందటి ఫ్లాష్‌బ్యాక్‌ని తవ్వుకుని, దానిక్కాస్త కొత్త కలరింగ్ ఇచ్చి.. సరికొత్తగా తెర మీదికి తీసుకొచ్చేశారు. టైటిల్ పాతదే.. రాయల తెలంగాణా. స్క్రీన్‌ప్లే ఒక్కటే మారింది.

రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో దీక్ష.. వేదిక కర్నూలు.. సబ్జెక్ట్‌.. సీమకు జరుగుతున్న అన్యాయం! చాలామంది సీనియర్ నేతలు హాజరయ్యారు. కానీ.. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డే అక్కడ హైలెట్ అయ్యారు. ఆయన చేసిన కామెంటే సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం కేసీఆర్‌కు ఉందన్నారు. అప్పుడే సీమకున్న నీటి కష్టాలు కూడా తీరుతాయ్ అంటూ జేసీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మళ్లీ కలవరాన్ని రేపాయి.

నిజానికి జేసీకి మనిషిక్కడ.. మనసక్కడ అన్నట్టే ఉంది. మొన్నా మధ్య తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు జేసీ. తెలంగాణను వదిలిపెట్టి చాలా నష్టపోయామని, ఏపీ వదిలేసి తెలంగాణకు వచ్చేస్తానంటూ అక్కడి ప్రజాప్రతినిధుల ముందు ఓపెనప్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి అలయ్‌బలయ్ కూడా ఆడుకున్నారు జేసీ. తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఏపీ కంటే తెలంగాణలో పాలన బాగుందంటూ అప్పట్లోనే హీట్ పుట్టించే కామెంట్లు చేశారు జేసీ. ఇప్పుడు అవే రిపీటయ్యాయి. సాగునీటి సమస్యలు తీరాలంటే.. సీమ-తెలంగాణా కలవాల్సిందే అనేది జేసీ సొల్యూషన్. కర్నూలు, అనంతపురం జిల్లాల్ని కలుపుకోడానికి కేసీఆర్‌కి పెద్ద కష్టమేమీ కాదన్నారు కూడా.

తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల్లో రాయల తెలంగాణ కూడా ఉంది. నాలుగు జిల్లాల సీమను కలుపుకుని తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది ప్రపోజల్‌. కాకపోతే.. హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న మెలిక పెట్టింది. దీంతో.. కేసీఆర్ సహా తెలంగాణ వాదులంతా నో అనెయ్యడంతో రాయల తెలంగాణా ప్రతిపాదనను పక్కకెళ్లిపోయింది. చివరకు హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి.. విభజన ప్రక్రియ షురూ చేసింది కేంద్రం. అది జరిగి తొమ్మిదేళ్లు గడిచిన తర్వాత, రెండోసారి ఎన్నికల జరుగుతున్న సమయంలో.. మళ్లీ రాయల తెలంగాణా స్లోగన్ వినిపించడం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

‘కేసీఆర్‌తో ఆల్రెడీ మాట్లాడేశా.. మిగతా వాళ్లతో కూడా సంప్రదింపులు అవుతున్నాయ్! ఐనా.. ఒక రాష్ట్రం విడిపోవడం కష్టం గాని.. ఒక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు కలపడం సులభమేగా’ అని అంటున్న జేసీకి, ఎన్నికల తర్వాత ఈ దిశగా ఉద్యమం చేస్తానంటున్న ఈ ఫైర్‌బ్రాండ్‌కీ కోరస్ ఇచ్చేదెవరు? సీమ నేతలైనా ఆయన మాటతో ఏకీభవిస్తారా? చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..