Andhra Pradesh: అన్నమైనా పెట్టండి.. జైల్లోనైనా వేయండి.. రోడ్డెక్కిన విద్యార్థులు
Andhra Pradesh: హాస్టల్‌లో ఉండే విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. హాస్టల్‌లో ఉండే పేద విద్యార్థులకు సరైన తిండి లేక పస్తలుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు వార్డెన్ వ్యవహారం విద్యార్థులకు మరింత ఇబ్బందిగా మారుతోంది. వార్డెన్ విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడుతుండటంతో చేసేదేమి లేక రోడ్డెక్కారు..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండల ప్రభుత్వ బీసీ వసతి గృహ విద్యార్దిని విద్యార్థులు నిరసనకు దిగారు. జెడ్పీ బాలికల హైస్కూల్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అన్నమైనా పెట్టండి.. జైల్లోనైనా పెట్టండి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎన్ ఎస్ ప్రసాద్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నిరసన ర్యాలీలో ఏఐఎస్ఎఫ్, విద్యార్ది సంఘాలు పాల్గొన్నాయి. రాజోలు ప్రభుత్వ బీసీ హాస్టల్లో గత మూడు నెలలుగా సరియైన భోజనం పెట్టడం లేదని విద్యార్థుల ఆందోళనకు దిగారు.
వార్డెన్ రావాలి.. ఆకలి తీర్చాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు హాస్టల్ విద్యార్థులు. విద్యార్థుల వద్ద వార్డెన్ డబ్బులు తీసుకుని క్లాస్ రూమ్‌లోనే మద్యం తాగుతూ విద్యార్థులను ఇష్టానుసారంగా తిడుతున్నాడని వార్డెన్‌పై ఆరోపించారు. అడిగినప్పుడు వార్డెన్‌కు డబ్బులు ఇవ్వకపోతే నానా దుర్భాషలాడుతున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా ఉదయం సాయంత్రం పెరుగన్నమే పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు స్పందించి నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని విద్యార్థులు కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి