CM Jagan Letter to PM: ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ.. ప్రైవేట్‌కు తగ్గించి ప్రభుత్వానికి వ్యాక్సిన్లను పెంచాలని విజ్ఞప్తి
ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు సహాకరించాలని కోరారు.
CM YS Jagan writes letter to PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు సహాకరించాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని.. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కేంద్రం పాలసీ ప్రకారం 25 శాతం టీకాలను ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించారు. అయితే, ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మిగిలిపోయిన వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని వైఎస్ జగన్ కోరారు.
దేశంలో కరోనా నియంత్రణకు గానూ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర సర్కార్ వివిధ ఔషధ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసి అయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. ఇదే క్రమంలో జులై నెలలో ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించింది. అయితే, ఇందులో ఇప్పటి వరకు 2.67లక్షల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు. ప్రైవేట్ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని లేఖలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.