Union Cabinet Expansion:తుది దశకు కేంద్ర కేబినెట్ విస్తరణ.. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో ప్రధాని భేటీ.. మంత్రుల పనితీరుపై సమీక్ష
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి అవకాశం దొరుకుతుంది.. మార్పులు చేర్పులపై ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.
Union Cabinet Expansion: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఖాయంగా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఎవరికి అవకాశం దొరుకుతుంది.. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్నదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన కేబినెల్ విస్తరణకు ఎట్టకేలకు ముహుర్తం ఖరారు అయ్యినట్లు రాజకీయవర్గాలు చెప్పుకుంటున్నాయి.
గత కొద్ది రోజులుగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలు వరుస భేటీలతో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చ మొదలైంది. దీనిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కసరత్తు పూర్తి చేసినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రులు, సహాయ మంత్రుల పనితీరుపై రిపోర్ట్స్ తెప్పించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే జూన్ 11న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఆ తర్వాత మంత్రులను గ్రూపులుగా చేసి వారి పనితీరును సమీక్షించారు. ఈ సమీక్షలో బీఎల్ సంతోష్, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, జితేంద్ర సింగ్ కూడా ఉన్నారు. సోమవారం కూడా మోదీ-షా-నడ్డాతోపాటు సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తోడయ్యారు. ఈ భేటీల్లో కేబినెట్ కసరత్తు పూర్తైనట్టు తెలుస్తోంది.
మిత్రపక్షాలు దూరమవడం, పలువురు మంత్రుల అకాల మరణాలతో కేంద్ర కేబినెట్‌లో ఖాళీలు ఏర్పడ్డాయి. సీనియర్ మంత్రి, మిత్రపక్షం లోక్‌జనశక్తి నేత రాంవిలాస్ పాశ్వాన్, కర్నాటక బీజేపీ నేత సురేశ్ అంగడి మృతితో రెండు శాఖలు ఖాళీ అయ్యాయి. శివసేన, అకాలీదళ్ దూరమైన కారణంగా వారి ప్లేస్‌లు కూడా భర్తీ కావల్సి ఉంది. ఐదు అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ ఖాళీలు భర్తీ చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికలు జరగనున్నాయి. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అగ్రపీఠం వేసి ప్రాధాన్యతనిచ్చిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మిత్రపక్షం అప్నాదళ్‌కు కూడా చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. ఆ పార్టీ నేత అనుప్రియ పటేల్ ఈ మధ్యే అమిత్ షాను కలిసి వెళ్లారు.
మరోవైపు, మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల్లో మార్పులు, చేర్పుల జరగవచ్చని తెలుస్తోంది. మంచిపనితీరు కనబర్చినవారికి మరింత ప్రాధాన్యత కలిగిన శాఖలు అప్పగించే అవకాశం ఉంది. పనితీరు సరిగాలేదని భావించినవారికి అంతగా ప్రాధాన్యతలేని శాఖలు లేదా పూర్తిగా ఉద్వాసన పలికే అవకాశం లేకపోలేదని సమాచారం. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడంలో విఫలమైన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఉద్వాసన తప్పదని చర్చ నడుస్తోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో సభ్యులుగా ఉండే మంత్రుల శాఖలను మార్చకపోవచ్చని తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ సర్కారు ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర కేబినెట్ చోటు కల్పిస్తారని ప్రచారం సాగుతోంది. అసోంలో రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్‌కు మంత్రివర్గంలో చోటు లభించవచ్చు. టర్మ్ పూర్తికాకుండా ఉత్తరాఖండ్ సీఎం పదవి నుంచి త్రివేంద్ర సింగ్‌తోపాటు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీకి బెర్తులు ఖాయమని అంచనా వేస్తున్నాయి పార్టీ వర్గాలు.
కేంద్ర కేబినెట్లో బీజేపీయేతర కేంద్రమంత్రి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) అధినేత రామ్‌దాస్ అథవాలే ఒక్కరే మిగిలారు. ఈ ఒక్కరూ లేకపోతే కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కారు చెప్పుకొవచ్చు. కొత్త స్నేహాలకు ఆహ్వానం పలుకుతున్న బీజేపీ, ఈసారి కేబినెట్ విస్తరణలో పాత, కొత్త మిత్రులకు చోటు కల్పించవచ్చని తెలుస్తోంది. సరైనా ప్రాధాన్యత ఇవ్వలేదని 2019లో మంత్రి పదవులు తీసుకోని జేడీయూకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్ర నుంచి కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెంచాలని అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ రేసులో రాజ్యసభ ఎంపీలు నారాయణ్ రాణే, ఉదయన్‌రాజే భోసలే, లోక్‌సభ ఎంపీ ప్రీతమ్ ముండే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఇక, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీలు వైఎస్ చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్‌తోపాటు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు పేరు ప్రచారంలో ఉన్నాయి. అయితే, ఈ నలుగురినీ కాదని, కొత్తవారికి చోటు కల్పించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పార్టీవర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఏపీ నుంచి చోటు కల్పించాలంటే, ఖచ్చితంగా వారు ఎంపీలే అయ్యుండాల్సిన అవసరం లేదన్న చర్చ నడుస్తోంది. అసలు అగ్రనేతల ప్రాధాన్యతలో ఆంధ్రప్రదేశ్ లేదని కూడా వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఈ సారి ఏపీకి ఖచ్చితంగా ఎవరొకరికి కేంద్రంలో మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.