Andhra Pradesh: నవంబర్ 14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కార్..
Andhra Pradesh: ఈ నెల 14వ తేదీన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో..
Andhra Pradesh: ఈ నెల 14వ తేదీన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. ముఖ్యంగా కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గోననున్నారు. అండమాన్‌నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ కూడా హాజరవుతారు.
కాగా, సదరన్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. సమావేశంలో ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చ జరుగడం వల్ల రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, ఏపీ విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను అజెండాలో పొందుపరిచామని సీఎంకు వివరించారు అధికారులు. తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, రూ. 6300 కోట్ల విద్యుత్ బకాయిలు, రెవిన్యూలోటు, రేషన్ బియ్యంలో హేతుబద్ధతలేని రీతిలో కేంద్రం కేటాయింపులు, తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే, ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ ప్రస్తావించాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సదరన్‌జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని సీఎం అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో నిర్ణయించారు.
వీటితో పాటు.. కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలన్న అంశాన్ని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనలమీదా సమావేశంలో చర్చించారు. దీనిపై రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలపై వివరాలు తయారుచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధం కావాలని సూచించారు. కౌన్సిల్ సమావేశంలో ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై కూడా తగిన రీతిలో స్పందించేలా సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్ధానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ (స్టేట్ రీఆర్గనైజేషన్) ఎల్ ప్రేమచంద్రారెడ్డి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్ కుమార్, మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎ రవిశంకర్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also read:
Hero Vishal: శ్రీవారి సన్నిధిలో హీరో విశాల్.. కాలినడకన తిరుమలకు చేరిన ఫొటోస్…
Crime News: వృద్ధ దంపతుల దారుణ హత్య.. కత్తులతో గొంతు కోసి పరారైన దుండగులు..