AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ చివరి భేటీ.. సమావేశ అనంతరం మంత్రుల మూకుమ్మడి రాజీనామా?

ప్రస్తుత మంత్రిమండలి చివరి సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది..

AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ చివరి భేటీ.. సమావేశ అనంతరం మంత్రుల మూకుమ్మడి రాజీనామా?
Ap Cabinet
Balaraju Goud
|

Updated on: Apr 07, 2022 | 7:52 AM

Share

Andhra Pradesh Cabinet Meet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఏపీ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రిమండలి చివరి సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి(Velagapudi)లోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) అధ్యక్షతన జరగనుంది.. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను సీఎం కోరే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత ప్రక్రియను ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. అయితే, ఇద్దరు మినహా మిగిలిన వారంతా రాజీనామా లేఖలు ఇస్తారని అత్యంత విశ్వసనీయ సమాచారం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాంకు CM జగన్‌ మళ్లీ అవకాశం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశం కావడంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్, మంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకోనున్నారు సీఎం. అయితే, సందర్బంగా మంత్రులకు సీఎం ఏం చెబుతారని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేబినెట్ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 40 అంశాలతో కేబినెట్ అజెండాను రూపొందించారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే, రంపచోడవరం కేంద్రంగా కొత్త గిరిజన జిల్లా ఏర్పాటుకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇక, సీఎం జగన్ హామీ మేరకు సంగం బ్యారేజికి మాజీ దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పేరు పెట్టడానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. అలాగే, రాజధాని అమరావతికి సంబంధించి సీపీఎస్ రద్దుపై అధికారుల కమిటీ వేయడంపై చర్చ జరుగనుంది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అలాగే, గిరిజన ప్రాంతాల్లో ఆర్వోఎఫ్ పట్టాల కేటాయింపు, పలు ప్రభుత్వరంగ సంస్థలకు భూకేటాయింపులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.

ఈ నెల 8వ తేదీన సీఎం జగన్‌ గవర్నర్‌ హరిచందన్‌ను కలుస్తారు. అదే రోజు కొత్త మంత్రుల లిస్ట్‌ను అందిస్తారని తెలుస్తోంది. CM తోపాటు 26 మంది మంత్రులు ఉండాలి. జగన్‌, ఇద్దరు మంత్రులు కాకుండా 23 మంది కొత్తగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్‌ అయింది. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. కొత్త మంత్రులు ఎవరన్న విషయాన్ని ఈ నెల 9 లేదా 10 ఉదయం వరకు గోప్యంగానే ఉంచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే 25 మందీ కొత్తవారే ఉంటారా? లేదా ప్రస్తుత మంత్రుల్లో కొంతమంది కూడా అందులో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Read Also… Sri Lanka Crisis: ఒక్క నిమ్మకాయ రూ.60.. పాలకుల వరుస తప్పటడుగులతో మరింత దిగజారుతున్న శ్రీలంక పరిస్థితులు!