సామాన్యులకు అందని ద్రాక్షగా చికెన్‌ ముక్క, నిమ్మ చెక్క.. టమాట, ఉల్లి ధరలు మాత్రం ఢమాల్

 కూరల్లో పిండుకునే నిమ్మకాయే రెచ్చిపోతుంటే నేను ఎందుకు తగ్గుతానని చికెన్‌ అంటోంది. స్కిన్‌లెస్‌ చికెన్‌ కేజీ 200 రూపాయలు పలుకుతోంది. సండే అయితే ధర మరో 20- 30 రూపాయలు పెరగడం మామూలైపోయింది.

సామాన్యులకు అందని ద్రాక్షగా చికెన్‌ ముక్క, నిమ్మ చెక్క.. టమాట, ఉల్లి ధరలు మాత్రం ఢమాల్
Lemon Price Today
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 07, 2022 | 7:22 AM

ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు ఉంది నిత్యావసర వస్తువుల పరిస్థితి. కొనబోతే కొరివి అన్నట్టుగా ధరలు మండుతున్నాయని గృహస్తులు వాపోతుంటే, అమ్మబోతే అడవిలాగ మా పరిస్థితి ఉందని రైతులు దిగాలు పడుతున్న దుస్థితి. చిత్రమైన పరిస్థితితో సామాన్యుడు చితికిపోతున్నాడు. ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోల్‌(Petrol), డీజిల్‌(diesel )ధరలతో కూరగాయలు పోటీపడుతున్నాయి. ఎండాకాలంలో ఓ గ్లాసు నిమ్మరసం తాగేందుకు కూడా జనం జంకుతున్న పరిస్థితి. తెలంగాణ(Telangana)లో ఈసారి నిమ్మకాయలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో నిమ్మకాయలు కనపడని పరిస్థితి. ఎక్కువ ధరకు తాము కొనుక్కువస్తున్నామని, కాని ధరలు చూసి జనాలు కొనేందుకు ముందుకు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. సాధారణ మార్కెట్‌లో ఒక్క నిమ్మకాయ ధర ఇరవై రూపాయలు పలుకుతోంది. ధరలు చుక్కలనంటడంతో భోజనం ప్లేట్‌ నుంచి కూడా నిమ్మకాయ కనుమరగువుతోంది. బిర్యానీలతో పాటు అందించే నిమ్మకాయ ముక్కలను చాలా హోటళ్లు ఆపేశాయి. చాట్‌ భండార్లు, నూడూల్స్ సెంటర్లలో నిమ్మకాయ మాయమైపోయింది. మరో వైపు నిమ్మకాయలకు భారీ ధర ఉండటంతో చాలా మంది పెద్ద వ్యాపారులు నేరుగా రైతుల దగ్గరకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. బస్తా నిమ్మకాయల ధర హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే 15 వేల రూపాయలు పలుకుతున్న పరిస్థితి.

కూరల్లో పిండుకునే నిమ్మకాయే రెచ్చిపోతుంటే నేను ఎందుకు తగ్గుతానని చికెన్‌ అంటోంది. స్కిన్‌లెస్‌ చికెన్‌ కేజీ 200 రూపాయలు పలుకుతోంది. సండే అయితే ధర మరో 20- 30 రూపాయలు పెరగడం మామూలైపోయింది. ఇక చాలా మంది ఇష్టంగా తినే స్కిన్‌లెస్‌ చికెన్ కేజీ ధర 250 రూపాయలు పలుకుతోంది. చికెన్‌ ముక్క, నిమ్మ చెక్క అందని ద్రాక్షగా మారుతుంటే అటు కోడి పెట్టిన గుడ్డు మాత్రం బేర్‌మంటోంది. నెల క్రితం వరకు దాదాపు 5 రూపాయలు వరకు పలికిన కోడి గుడ్డు ధర గత కొన్ని రోజులుగా మూడున్నర దాటడం లేదు. కొవిడ్‌ సమయంలో గుడ్లకు బాగా డిమాండ్‌ ఉండటంతో చాలా మంది రైతులు పౌల్ట్రీ వ్యాపారంలోకి దిగారు. ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు రెండు మూడు గుడ్లు తిన్నా ఇబ్బందేమి ఉండదని చాలా వైద్యులు సూచించడంతో వాటికి డిమాండ్‌ బాగా పెరిగింది. అదే స్థాయిలో డిమాండ్‌ కొనసాగుతుందని భావించిన పౌల్ట్రీ రైతులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ భయాలు తొలగిపోవడంతో గుడ్డుకు డిమాండ్‌ బాగా తగ్గింది. మరో వైపు దాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఎటూ పాలుపోని పరిస్థితి. ఇదే అదనుగా చాలా మంది దళారులు పౌల్ట్రీ రైతుల నుంచి అడ్డగోలు ధరకు గుడ్లు కొంటున్నారు. కోడిగుడ్లను నిల్వ చేసుకునే సామర్ధ్యం చిన్న రైతులకు ఉండకపోవడం దళారులకు బాగా కలిసొస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం కోడి గుడ్డు చిల్లర ధర నాలుగున్నర వరకు ఉంది. కాని తమకు లభిస్తుందన్నది మూడున్నరే అని రైతులంటున్నారు. ఒక్క గుడ్డు ఉత్పత్తికి దాదాపు మూడు రూపాయల 75 పైసల వరకు తమకు ఖర్చవుతుందని పౌల్ట్రీ రైతులంటున్నారు.

కనీసం గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో పౌల్ట్రీ రైతులు కోడిగుడ్లను రోడ్డుపై పారేసి హైదరాబాద్‌లో నిరసన కూడా తెలిపిన పరిస్థితి. దేశమంతా గుడ్డుకు ఒకే ధర ఉంటే బాగుంటుందని చెప్తూ NECC ఛైర్‌పర్సన్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. నిమ్మకాయ, చికెన్‌ రెచ్చిపోతుంటే అటు టమాట, ఉల్లి ధరలు నేలచూపులు చూస్తున్నాయి.ప్రభుత్వాలను కూలదోసే శక్తి కలిగిన ఉల్లి, టమాట ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి. రిటెయిల్‌ మార్కెట్‌లో ఉల్లి కేజీ 15 నుంచి 20 రూపాయలు పలుకుతోంది. సామాన్యులకు ఇది వినసొంపుగా ఉన్నా రైతులకు మాత్రం తల్లడిల్లుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధరల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే ఉల్లి సాగుకు ఎవరూ ముందుకు రారని రైతులంటున్నారు.

మొత్తానికి ఇటు ధరల భారం భరించలేకపోతున్నామని సాధారణ ప్రజలు, చేస్తున్న సాగుకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు అంటున్న తల్లడిల్లుతున్నారు. పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Also Read: వ్యాన్ బోల్తా.. పరుగులు తీసిన డ్రైవర్.. పోలీసులు తికమక.. స్పాట్‌లో చెక్ చేయగా