Sri Lanka Crisis: ఒక్క నిమ్మకాయ రూ.60.. పాలకుల వరుస తప్పటడుగులతో మరింత దిగజారుతున్న శ్రీలంక పరిస్థితులు!

ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు.. ఆహారం, ఔషధాలు, ఇంధన కొరత.. రోజుల తరబడి కరెంటు కోతలు.. ఇలా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో బ్రతుకు దుర్భరంగా మారింది..

Sri Lanka Crisis: ఒక్క నిమ్మకాయ రూ.60.. పాలకుల వరుస తప్పటడుగులతో మరింత దిగజారుతున్న శ్రీలంక పరిస్థితులు!
Sri Lanka
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 07, 2022 | 7:36 AM

Sri Lanka Economic Crisis: ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలు.. ఆహారం, ఔషధాలు, ఇంధన కొరత.. రోజుల తరబడి కరెంటు కోతలు.. ఇలా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో బ్రతుకు దుర్భరంగా మారింది.. ఈ కష్టాలకు కారణమైన రాజపక్సకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు.. భారత్‌తో పాటు అంతర్జాతీయ సాయం కోసం ఆ దేశం దీనంగా చూస్తోంది..

లంకలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి.. హిందూ మహా సముద్రంలోని ఈ ద్వీప దేశాన్ని అన్ని వైపులా కష్టాలు చుట్టు ముట్టాయి.. గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో కూరుకుపోయింది ఈ చిన్న దేశం.. ప్రభుత్వం పూర్తిగా దివాళా తీయడంతో శ్రీలంక ప్రజల కష్ఠాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు బతుకులు దుర్భరంగా మారాయి.. శ్రీలంకలో ఎక్కడ చూసినా ఇవే కష్టాలు..

శ్రీలంక పాలకుల వరుస తప్పటడుగులతో మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి.. అమెరికా డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఇంధనం, ఆహారం, ఔషధాలు నిలిచిపోయాయి.. మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటాయి.. మార్కెట్‌లో కూరగాయ ధరలు భగ్గుమంటున్నాయి.. 60 రూపాయలు పెడితే గాని ఒక్క నిమ్మకాయ కొనలేని పరిస్థితి ఏర్పడింది..

శ్రీలంక అంతటా తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది.. పెట్రోలు ఎప్పుడొస్తుందో తెలియదు.. బంకుల దగ్గర భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి.. బొగ్గు, సహజవాయువులు దిగుమతులు నిలిచిపోవడంతో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది.. రోజుకు 14 గంటల విద్యుత్‌ కోతలు అమలవుతున్నాయి. కరెంటు లేక కార్యాలయాలు, కర్మాగారాలు, వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి.. ఉత్పత్తి నిలిచిపోవడంతో దేశం మరింత సంక్షోభంలోకి కూరుకుపోతోంది..

మూడేళ్ల క్రితం బాంబు పేలుళ్లు.. ఆ తర్వాత కరోనా సంక్షోభంతో ప్రధాన ఆదాయ వనరైన పర్యాటక రంగం కాస్తా కుదేలైపోయింది. పర్యాటకులు సందడి లేక హోటల్స్‌ ఖాళీగా కనిపిస్తున్నాయి.. ఈ కష్టాల నుంచి బయట పడేందుకు శ్రీలంక ప్రభుత్వం విదేశీ సాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.. భారత్‌ వైపు ఆశగా చూస్తోంది ఈ ద్వీప దేశం.. ఇప్పటికే మన దేశం వీలైంత సాయం చేసి శ్రీలంకకు అండగా నిలిచింది..

లంకలో ఆర్థిక సంక్షోభం ఇప్పుడు రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు.. “గోటా గో హోమ్” నినాదాలు మార్మోగుతున్నాయి.

Read Also… MIM Corporator: పోలీస్‌ పవర్‌ చూపిస్తామంటే ఇక్కడ నడవదు.. రెచ్చిపోయిన మరో ఎంఐఎం కార్పొరేటర్!