Tulasi Reddy : ‘బొంకరా బొంకరా పోలిగా అంటే.. టంగుటూరి మిరియాలు తాటికాయంతా’ అన్నట్లుంది : తులసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జాబ్ క్యాలెండర్ మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకూ ఈ అంశంపై టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తే, ఇప్పుడు..
AP Job Calendar : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జాబ్ క్యాలెండర్ మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకూ ఈ అంశంపై టీడీపీ నేతలు వరుస విమర్శలు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్, వామపక్షాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో మేనిఫెస్టోలో భర్తీ చేస్తామని చెప్పింది 2 లక్షల 30 వేలని, ఈ రెండేళ్లలో 6, 03, 756 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని జగన్ సర్కారు గొప్పలు చెప్పుకుంటోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.
‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంతా’ అన్నట్లుంది సీఎం జగన్ వ్యవహారం అని ఆయన ఎద్దేవా చేశారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బందిపోనూ ప్రభుత్వం భర్తీ చేసింది కేవలం 11,359 రెగ్యులర్ ఉద్యోగాలేనని తులసీరెడ్డి అన్నారు.
2021-2022లో 10,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్‌ను సర్కార్ విడుదల చేసిందని, అయితే, ప్రస్తుతం 2 లక్షల 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. 10,143 కాకుండా 2,50,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేటట్లు 2021-2022 జాబ్ క్యాలెండర్ మళ్లీ విడుదల చేయాలని తులసీరెడ్డి డిమాండ్ చేశారు. అటు, సీపీఐ నేత రామకృష్ణ కూడా సీఎం వైయస్ జగన్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ పై విమర్శలు గుప్పించారు.