AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chevireddy Bhaskar Reddy: ఆదిలోనే హంసపాదు.. చెవిరెడ్డికి ఒంగోలులో నిరసన సెగ.. ఫ్లెక్సీలు తగులబెట్టి..!

ఒంగోలులో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో కలకలం రేగింది. మంత్రి మేరుగు నాగార్జున క్యాంపు కార్యాలయం దగ్గర రోడ్డుపై ఇతర వైసీపీ నాయకులతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలను మంత్రి నాగార్జున అనుచరులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఉన్న చెవిరెడ్డి ఫోటోలను మాత్రమే దుండగులు చించేయడం ఒంగోలు వైసీపీలో చర్చకు దారి తీసింది.

Chevireddy Bhaskar Reddy: ఆదిలోనే హంసపాదు.. చెవిరెడ్డికి ఒంగోలులో నిరసన సెగ.. ఫ్లెక్సీలు తగులబెట్టి..!
Ycp Flexi War
Fairoz Baig
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 02, 2024 | 6:28 PM

Share

ఒంగోలులో వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో కలకలం రేగింది. మంత్రి మేరుగు నాగార్జున క్యాంపు కార్యాలయం దగ్గర రోడ్డుపై ఇతర వైసీపీ నాయకులతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలను మంత్రి నాగార్జున అనుచరులు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఉన్న చెవిరెడ్డి ఫోటోలను మాత్రమే దుండగులు చించేయడం ఒంగోలు వైసీపీలో చర్చకు దారి తీసింది. చెవిరెడ్డి ఫ్లెక్సీ ని చించి కింద పడేయడమే కాకుండా వాటిని తగులబెట్టారు. ఇదంతా వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం పక్కనే రోడ్డుపై జరిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చెవిరెడ్డి ఫ్లెక్సీ లను చించివేశారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన మంత్రి మేరుగు నాగార్జున జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తన క్యాంప్ కార్యాలయం దగ్గర చెవిరెడ్డి ఫ్లెక్సీలను చించలేదని, ఎక్కడో రోడ్డుపైన చించివేశారని తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి, తనకు సీఎం వైఎస్ జగన్‌ ఆశీస్సులు ఉన్నాయని, ఒంగోలులో తనకు బాలినేనే నాయకుడని, ఆయన ఆశీస్సులతోనే పనిచేసుకుంటున్నామని, ఏదిఏమైనా బాలినేనే మా నాయకుడు అంటూ మంత్రి మేరుగు నాగార్జున పదేపదే ఆందోళనతో సమాధానం చెప్పడం విశేషం..

బాధ్యతలు చేపట్టకముందే చెవిరెడ్డికి నిరసన సెగ…

ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని సంతనూతలపాడు, నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని కందుకూరు, కావలి నియోజకవర్గాలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రీజనల్ కో ఆర్డినేటర్‌గా వైసీపీ అధిష్టానం నియమించింది. రెండు రోజుల్లో చెవిరెడ్డి ఒంగోలుకు వచ్చి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. మరోవైపు ప్రకాశం రీజనల్ కో ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తున్న బాలినేని రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. వైసీపీ అధిష్గానం నిర్ణయంతో అసంతృప్తికి గురైన బాలినేని హైదరాబాద్‌ వెళ్ళినట్టు సమాచారం..

ఈ సమయంలో చెవిరెడ్డిని రీజనల్ కో ఆర్డినేటర్‌గా నియమించడంతో ఆయన ఒంగోలు వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఒంగోలులో జిల్లా పార్టీ కార్యాలయం సమీపంలోని సంతనూతలపాడు వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి నాగార్జున క్యాంప్‌ కార్యాలయం ఉంది. దీంతో ఇక్కడ రోడ్డుపై వైసీపీ నాయకులతో పాటు చెవిరెడ్డి ఫోటోలను కూడా ముంద్రించిన ఫ్లెక్సీలను మంత్రి నాగార్జున అనుచరులు ఏర్పాటు చేశారు. అందరికన్నా పైభాగంలో చెవిరెడ్డి ఫోటోలు వేసి బాలినేని, ఇతర నాయకుల ఫోటోలను కింద వేశారు. ఇదే రచ్చకు దారి తీసింది.

ఈ కారణంతోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చెవిరెడ్డి ఫోటోలను చించివేసినట్టు అనుమానిస్తున్నారు. ఒంగోలు రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందే చెవిరెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో ఆదిలోనే చెవిరెడ్డికి హంసపాదు అన్నట్టుగా వ్యవహారం మారింది. ఈ వ్యవహారం ఒంగోలు వైసీపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…