Telangana: ఆత్మలపై రుణాలు.. ఇదేంటని రికవరీ ఏజెంట్లు ఇంటికి వెళ్లగా.. బయటపడ్డ విస్తుపోయే నిజాలు
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అలాగే జరిగింది ఓ ఫైనాన్స్ కంపెనీలో.. అదునుగా భావించిన ఓ ఘరానా ఉద్యోగి పని చేస్తున్న కంపెనీనే బురిడీ కొట్టించాడు. లోన్‌ల పేరిట ఏకంగా ఆరు కోట్లకు టోకరా పెట్టేసి పరారయ్యాడు.
అలా ఇలా కాదు ఏకంగా చనిపోయిన వారి పేరు మీద హౌస్ లోన్లు తీసుకొని.. వాటికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇటు పని చేస్తున్న సంస్థను అటు నమ్మిన స్నేహితులను ఆ ఘనుడు నట్టెట్ట ముంచేశాడ. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోళా ఫైనాన్స్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బినామీ పేర్లతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సుమారు రూ.6 కోట్లు కాజేశాడు. అలా ఇలా కాదు ఏకంగా చనిపోయిన వారి పేరు మీద కూడా లోన్లు తీసుకుని ఆ సంస్థకే షాక్ ఇచ్చాడు. లోన్ రికవరీ కోసం సదరు సంస్థ ఏజేంట్లు లోన్లు తీసుకున్నట్టుగా చెప్తున్న వారి ఇంటికి వెళ్లడంతో అసలు బండారం బయటపడింది. మీ ఇంటాయన రూ. 25 లక్షలు మీ ఇంటిపై లోన్ తీసుకున్నాడని.. ఇన్ టైంలో ఈఎంఐ చెల్లించడం లేదని నిలదీశారు. దీంతో అవాక్కైన సదరు కుటుంబ సభ్యులు.. అసలు తాము ఏ సంస్థలో లోన్ తీసుకోలేదని.. మీరు చెప్తున్న వ్యక్తి చనిపోయి ఏళ్లు గడుస్తున్నాయని.. చనిపోయిన వ్యక్తి ఎలా లోన్ తీసుకుంటాడని ఏజేంట్లను కుటుంబ సభ్యులు నిలదీయడంతో అసలు భాగోతం బట్టబయలైంది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కత్తరశాల కిష్టంపేట గ్రామాలలోని పలువురు మృతులతో పాటు పలువురు వ్యక్తుల పేరున కత్తర శాల గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి చోళా ఫైనాన్స్ సంస్థలో బాధితులకు , బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండానే గృహ రుణాలు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇటీవలే ఆ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది కిష్టంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి ఆయన పేరున ఉన్న రూ.25 లక్షలకు సంబంధించిన మంత్లీ ఈఎంఐ చెల్లించాలని కోరగా.. రుణం పొందిన వ్యక్తి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. రెండేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి ఇప్పుడు లోన్ తీసుకోవడం ఏంటని లోన్ రికవరీ ఏజెంట్లను నిలదీశారు. దీంతో ఆందోళనకు గురైన రికవరీ ఏజెంట్లు సంస్థలో ఆరా తీయగా కత్తరశాల గ్రామానికి చెందిన తమ సంస్థ ఉద్యోగి ప్రవీణ్.. దాదాపు 15 మంది పేరున ఇదే స్టైల్‌లో లోన్లు తీసుకున్నాడని.. ఏకంగా ఆరు కోట్ల పైగా అక్రమంగా రుణాలు పొందాడని తేలింది.
దీంతో అలర్ట్ అయిన బాధితులు సదరు వ్యక్తిని నిలదీయగా.. డబ్బుల ఆశతో అలా చేశానని.. మన్నించాలని మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తానంటూ పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాడు. భూములకు సంబందించిన పేపర్లు తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలు దేరిన ప్రవీణ్.. ఫోన్ స్విచ్ ఆప్ చేసి బాధితుల కళ్లు గప్పి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో బాధితులు అటు పోలీసులకు ఫిర్యాదు చేయలేక.. ఇటు ఈఎంఐలు కట్టలేక ఆందోళనకు గురవుతున్నారు.
చెన్నూర్ మండలంలోని కత్తరశాల, కిష్టంపేట గ్రామాలకు చెందిన 15 మందికి పక్కా భవనాలు ఉన్నట్లుగా ఫేక్ ఫొటోలు డాక్యుమెంట్లతో ఒక్కొక్కరి పేరున రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల రుణాలు తీసుకోగా.. బినామీ పేర్లతో రుణాలు తీసుకొని కోట్లాది రూపాయల మోసం చేసిన ఆ నిందితుడుపై చోళా ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ రుణాల వ్యవహారంలో సంస్థకు చెందిన కీలక సభ్యుల హస్తం ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ఈ ఘటనపై ఇటు బాధితులు కానీ అటు సంస్థ యాజమాన్యం కానీ పోలీసులను సంప్రదించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు మాత్రం.. ఆర్థిక మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రుణాలు ఇప్పిస్తామని చెప్పి డాక్యుమెంట్లు అడిగితే ఎవరికి ఇవ్వవద్దని.. ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఇలాగే తప్పుడు పద్దతిలో రుణాలు తీసుకొని మోసం చేసే ఛాన్స్ ఉందని పోలీసులు చెప్తున్నారు. చోళా కంపెనీ హౌస్ లోన్ మోసాలపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని… బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ రవీందర్ తెలిపారు
మరిన్ని