AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఛీ.. ఛీ.. ఆస్తి కోసం ఎంత పని చేశావ్.. సొంత అన్నదమ్ములను కడతేర్చిన సోదరి..

వ్యసనాలకు బానిసయ్యారు.. తండ్రి డబ్బులు కోసం కుస్తీ పడ్డారు. ఒకరిపై మరొకరికి అనుమానం పెరిగిపోయింది. దీంతో ఆస్తిని దక్కించుకునే క్రమంలో అన్నదమ్ముల్నే ఏకంగా హత్య చేసింది ఒక సోదరి... ఈ విషాద ఘటన పల్నాడు జిల్లా నకరికల్లులో చోటు చేసుకుంది.

Andhra Pradesh: ఛీ.. ఛీ.. ఆస్తి కోసం ఎంత పని చేశావ్.. సొంత అన్నదమ్ములను కడతేర్చిన సోదరి..
Crime News
T Nagaraju
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Dec 16, 2024 | 12:38 PM

Share

మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. మారిపోతున్న మానవీయ విలువల గురించి ఈ పాటను మనం తరచూ గుర్తుచేసుకుంటుంటాం.. నిజంగా.. నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.. ఆధునిక కాలంలో మనుషులంతా మారిపోతున్నారు. ఒకప్పుడు మానవ సంబంధాలకు పెద్దపీట వేసే వారు.. ఇప్పుడు ఆస్తిపాస్తులు, డబ్బుకు విలువ ఇస్తున్నారు. సిరిసంపదల కోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. ఎంతలా అంటే.. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, తోబుట్టువులను కూడా చంపుతున్నారు.. తాజాగా.. జరిగిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది.. ఆస్తి కోసం ఓ మహిళ.. తోడ బుట్టిన సోదరులను చంపింది.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది..

పల్నాడు జిల్లాలోని నకరికల్లులోని యానాది కాలనీకి చెందిన పౌలిరాజు ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నాడు. పౌలి రాజుకు ముగ్గురు సంతానం.. పెద్ద కొడుకు గోపి క్రిష్ణ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు రామక్రిష్ణ టీచర్ గా పనిచేస్తున్నాడు. కుమార్తె క్రిష్ణవేణి తో పాటు ఇద్దరూ కొడుకులకి పౌలిరాజు వివాహాలు చేశాడు. అయితే క్రిష్ణవేణితో పాటు ఇద్దరు కొడుకుల వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. దీంతో ముగ్గురు ఒంటరయ్యారు. కొడుకులిద్దరూ భార్యలను వదిలివేయగా కుమార్తె క్రిష్ణవేణి భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వచ్చింది. కొడుకులిద్దరూ కూడా తండ్రి ఇంటి నుంచే ఉద్యోగాలకు వెళ్లేవారు. ఈ క్రమంలో తండ్రి పౌలిరాజు అస్వస్థతకు గురయ్యాడు. పక్షవాతం బారిన పడి మంచానికే పరిమితం అయ్యాడు. కొద్దీ రోజుల కిందట పౌలిరాజు చనిపోయాడు. దీంతో ఆయనకు ప్రభుత్వం నుంచి నలభై లక్షల రూపాయల నగదు వస్తుందని కుటుంబ సభ్యులు భావించారు.

ఆ డబ్బులు ఎవరూ తీసుకోవాలన్న అంశంలో ఇద్దరు సోదరులు, సోదరి.. ముగ్గురు మధ్య విబేధాలు మొదలయ్యాయి. తండ్రిని చూసినందుకు తనకే ఆ డబ్బులు రావాలని క్రిష్ణవేణి సోదరులతో గొడవ పడింది. అయితే తమకు వాటా వస్తుందని సోదరులు ఆమెతో గొడవ పడ్డారు. క్రిష్ణవేణి ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలనుకుంది.

ఈ క్రమంలోనే తమ్ముడు రామక్రిష్ణని గత నెల 26వ తేదిన నకరికల్లు సమీపంలోని కాలువలోకి తోసి చంపేసింది. ఈ నెల పదో తేదిన అన్న గోపిక్రిష్ణను చున్నీతో ఉరివేసి చంపేసింది. అయితే, ఈ రెండు హత్యలు క్రిష్ణవేణి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి సాయంతో చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు మృతదేహాల కోసం గాలిస్తున్నారు.

ప్రస్తుతం క్రిష్ణవేణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. ఆమె ద్వారా మృతదేహాల ఆచూకీని కనిపెట్టనున్నారు.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..