AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కన్న కొడుకును దారుణంగా నరికి చంపిన తల్లి.. కారణమేంటో తెలుసా?

తొమ్మిది నెలలు మోసి కని పెంచిన కన్నతల్లే అతి కర్కశంగా నరికి చంపిందంటే..ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో..ఒక కొడుకుతో కలిసి..

Andhra Pradesh: కన్న కొడుకును దారుణంగా నరికి చంపిన తల్లి.. కారణమేంటో తెలుసా?
Murder
Shiva Prajapati
|

Updated on: Nov 10, 2022 | 9:45 PM

Share

తొమ్మిది నెలలు మోసి కని పెంచిన కన్నతల్లే అతి కర్కశంగా నరికి చంపిందంటే..ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో..ఒక కొడుకుతో కలిసి మరో కొడుకును..అతి దారుణంగా హత్య చేసిందంటే..ఆమె పడిన వేదన ఊహకందుతుందా.. చంపకముందు చస్తూ బతికింది.. చంపిన తర్వాత..మరో విధంగా ఏడుస్తూ చస్తూ బతుకుతోంది. ఇదేనా ఆ తల్లికి దేవుడు విధించిన శిక్ష.

తల్లి జయమ్మ.. కన్నతల్లి.. కడుపున పుట్టిన కొడుకును ప్రేమగా పెంచుకున్న తల్లి..ఇప్పుడు ఆ కన్నపేగునే కసితీరా నరికి చంపేసింది. ఎందుకలా చేసింది. చంపేటప్పుడైనా అతడు కొడుకని..ఆడించి లాలించి ఎత్తుకుని పెంచిన చిన్ననాటి ప్రేమలు గుర్తుకు రాలేదా అంటే.. ఎందుకు రావు.. కాలమనే జీవితంలో ఆ కన్నతల్లికి ఆ కొడుకు పెట్టిన క్షోభ అలాంటిది. అనంతపురం జిల్లా.. గుంతకల్లు ఆదర్శనగర్‌లో భీమేష్‌ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ హత్య..తెల్లారేసరికి ఊరంతా పాకింది.

ఈమె పెద్ద కొడుకు పేరే భీమేష్.. నిత్యం మద్యం తీసుకుంటాడు. తాగితే మనిషి కాదు. తల్లి, తమ్ముడు, తండ్రి, స్నేహితులు ఎవరినీ వదలడు.. అందరినీ క్షోభ పెడతాడు. బయటివాళ్ల జోలికెళ్తే తంతారు. అందుకే తాగొచ్చి ఇంట్లోవాళ్లపై వీరంగం చేస్తాడు. ఎంత చెప్పినా వినలేదు. మందు తాగొద్దురా అని ఆ తల్లి చెప్పిన మాటలు అతడికి రుచించలేదు. తల్లినే కొట్టేవాడు. తమ్ముడిని తన్నేవాడు. అయినా చాలా కాలం ఓర్చుకున్నారు. రాత్రయ్యిందంటే.. ఈ తల్లీ కొడుకులకు దడే.. భీమేష్‌ వచ్చి ఏం చేస్తాడో..ఎంత రాద్ధాంతం చేస్తాడోనని భయంతో బిక్కుబిక్కుమనేవాళ్లు.

ఇవి కూడా చదవండి

ఎంత సర్ది చెప్పినా..ఎంత మందలించినా భీమేష్‌ మారలేదు. పైగా రోజురోజుకూ నెత్తికెక్కి కూర్చుంటున్నాడు. ఇతడి పీడ విరగడయ్యేలా ఏదొకటి చేయాలనుకుంది..ఆమె రెండో కొడుకు కూడా అదే అనుకున్నాడు. వీడు మారడు.. వీడిని చంపి నాకు ఒక్కటే కొడుకు పుట్టాడనుకుంటానని ఆ తల్లి అనుకుందో ఏమో.. అన్నంత పనీ చేసింది. బుధవారం రాత్రి భీమేష్‌ ఇంటికి రాగానే.. అతడి తమ్ముడు.. జయమ్మ రెండో కొడుకు మనోహర్‌ కర్రతో భీమేష్‌ తలపై ఒక్కటేశాడు.. మద్యం మత్తులో ఉన్న భీమేష్‌ దెబ్బకు కింద పడ్డాడు.. ఆ తర్వాత జయమ్మ, మనోహర్‌ కత్తితో నరికి చంపేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి మూట కట్టేశారు. తెల్లవారు జామున డెడ్‌బాడీని బైక్‌పై తీసుకెళ్తుండగా.. కుక్కలు అరవడంతో.. గుంతకల్‌ శివారుల జనం గమనించి..వాళ్లను నిలిపివేసి నిలదీశారు.. దీంతో.. జయమ్మ, మనోహర్‌ భయపడి..డెడ్‌బాడీని అక్కడే వదిలేసి..బైక్‌ కూడా అక్కడే పడేసి పారిపోయారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫోన్‌ చేశారు. విచారణలో ఈ హత్యకు కుటుంబ గొడవలే కారణమని తేలింది.

భీమేష్‌ వేధింపులు భరించలేకే తాము ఈ హత్య చేసినట్లు జయమ్మ పోలీసుల ఎదుట ఒప్పుకుంది. అయితే జయమ్మ చిన్న కొడుకు మనోహర్‌ మైనర్‌. తాగి తల్లినే కొట్టడానికి వచ్చే భీమేష్‌.. ఇప్పుడు ఆ కన్నతల్లి చేతిలోనే చంపబడ్డాడు. ఎదిగిన కొడుకుని చేతులారా చంపేసి ఆ తల్లి ఎంత బాధపడుతోందో.. కానీ.. చంపకముందు క్షణక్షణం అతడుపెట్టే నరకాన్ని తట్టుకోలేక చస్తూ బతికేది..ఇప్పుడు ఆ కొడుకును చంపేసి.. తను జైల్లో కుమిలిపోతోంది.. ఎంతైనా ఆమె కూడా తల్లే కదా.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..