AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకాశంజిల్లాలో విశాఖ డ్రగ్స్‌ మూలాలు.. రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు..

విశాఖలో భారీగా పట్టుపడ్డ నిషేధిత డ్రగ్స్‌ను దిగుమతి చేసుకున్నది ప్రకాశంజిల్లాకు చెందిన వ్యాపారస్థులు కావడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి చెందిన కూనం కుటుంబానికి చెందిన సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్ కంపెనీ బ్రెజిల్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా విశాఖకు రొయ్యల మేత పేరుతో డ్రైఈస్ట్‌ను దిగుమతి చేసుకుంది.

ప్రకాశంజిల్లాలో విశాఖ డ్రగ్స్‌ మూలాలు.. రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు..
Vizag Drugs
Fairoz Baig
| Edited By: Srikar T|

Updated on: Mar 23, 2024 | 1:49 PM

Share

విశాఖలో భారీగా పట్టుపడ్డ నిషేధిత డ్రగ్స్‌ను దిగుమతి చేసుకున్నది ప్రకాశంజిల్లాకు చెందిన వ్యాపారస్థులు కావడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడికి చెందిన కూనం కుటుంబానికి చెందిన సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్ కంపెనీ బ్రెజిల్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా విశాఖకు రొయ్యల మేత పేరుతో డ్రైఈస్ట్‌ను దిగుమతి చేసుకుంది. అయితే ఈ డ్రైఈస్ట్‌ పేరుతో వచ్చిన కంటైనర్‌లో 25వేల కిలోల డ్రగ్స్‌ ఉన్నాయంటూ సిబిఐ సోదాలు చేసి కేసు నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. సంధ్యా ఆక్వా కంపెనీ నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి వాసులది కావడంతో డ్రగ్స్‌ దందాపై ప్రకాశంజిల్లా వాసుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

మూలాలు ప్రకాశంజిల్లాలో..

విశాఖపట్నం పోర్టులో దొరికిన భారీ డ్రగ్స్‌ కేసులో పేరు వినిపిస్తున్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కూనం కోటయ్య కుటుంబం ప్రకాశంజిల్లా ఈదుమూడి గ్రామానికి చెందినవారు. నాగులుప్పలపాడు మండలంలోని ఈదుమూడికి చెందిన కూనం కోటయ్య, సుబ్బాయమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో మూడో కుమారుడు వీరభద్రరావు, మరో కుమారుడు రొయ్యల కంపెనీ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. గత పాతికేళ్ళుగా సొంతూరికి దూరంగా ఉంటూ కాకినాడ, పామర్రు, వైజాగ్‌ ప్రాంతాల్లో ఆక్వా కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు. కూనం కోటయ్య రెండో కుమారుడు పూర్ణచంద్రయ్య ఈదుమూడిలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ స్థానికంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈదుమూడిలో కూడా ఒక ఆక్వా కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ కంపెనీ గత కొన్నాళ్ళుగా మూతపడిందని చెబుతున్నారు. అప్పుడప్పుడు సీజన్‌లో ఆక్వా కంపెనీలో రొయ్యల ప్రాసెస్ జరుగుతోందని, ఎక్కువ కాలం కంపెనీ మూసే ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కంపెనీ ఎదుట ప్రస్తుతం ఎలాంటి బోర్డు లేదు. స్థానికంగా ఉంటున్న కూనం పూర్ణచంద్రరావు రాజకీయంగా చురుగ్గా ఉండటమే కాకుండా గ్రామంలో పలు అభివృద్ది, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో పూర్ణచంద్రరావు, ఆయన బంధువులు కలిసి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందల ఎకరాలు కొనుగోలు చేశారని గ్రామస్థులు చెబుతున్నారు.

రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు..

సంధ్యా ఆక్వా పేరుతో వ్యాపారం చేస్తున్న ఆ కంపెనీ ఎండి కూనం వీరభద్రరావు, సిఇవో కూనం కోటయ్యలకు అన్ని రాజకీయ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాల విషయంలో అయితేనేమి, ఇతర సేవా కార్యక్రమాల నిర్వహణ విషయంలో అయితేనేమీ పలువురు బిజెపి, టిడిపి, వైసిపి నేతలను కూనం కుటుంబ సభ్యులు కలుస్తుంటారు. ఈక్రమంలోనే కూనం కుటుంబ సభ్యులు ప్రకాశంజిల్లా వాసులు కావడం, ఇక్కడి నుంచి వెళ్ళి విశాఖ, ఉత్తరాధ్రజిల్లాల్లో రాజకీయాలు చేస్తున్నక జిల్లాకు చెందిన బిజెపి, టిడిపి, వైసిపి నేతలను కలుస్తుండటంతో వీరికి రాజకీయ నేతల ప్రాబల్యం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కూనం కుటుంబ సభ్యులు మీవారంటే, మీవారంటూ రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఎవరు ఎవరి వారైనా పట్టుబడింది అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్‌గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన డ్రగ్స్‌ను విశాఖలో పట్టుకోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ డ్రగ్స్‌ వ్యవహారంలో నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..