Pharma Company: ఫార్మా ఫ్యాక్టరీ నుంచి విషవాయువుల లీక్‌.. ముగ్గురికి అస్వస్థత.. ఫ్యాక్టరీకి పర్మిషన్‌ లేనట్లు గుర్తింపు..

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట విషవాయువుల లీక్‌ ఘటనపై టీవీ9 వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదలింది. ఆటోనగర్‌లో యస్‌యల్ ఫార్మా కంపెనీని సీజ్‌ చేశారు అధికారులు. ఘటనపై విచారణకు సైతం ఆదేశించారు ఆర్డీవో.

Pharma Company: ఫార్మా ఫ్యాక్టరీ నుంచి విషవాయువుల లీక్‌.. ముగ్గురికి అస్వస్థత.. ఫ్యాక్టరీకి పర్మిషన్‌ లేనట్లు గుర్తింపు..
Gas Leak In Pharma Company
Follow us
Surya Kala

|

Updated on: May 28, 2023 | 7:51 AM

ఫార్మా కంపెనీలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. వరస ప్రమాదాలు జరగడం, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది. ఏటా లాభాల లెక్కలు వేసుకుంటున్న కంపెనీలు ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల సంఖ్య పెరిగిపోతున్నా సరే ఖాతరు చేయడం లేదు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట లోని ఫార్మా ఫ్యాక్టరీ నుంచి విషవాయువుల లీక్‌ అయ్యాయి. దాంతో.. ముగ్గురు కార్మికులు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. విషవాయువు పీల్చడంతో.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. బాధితులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. అస్వస్థతకు గురైన బాధితులను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివప్రసాద్‌, అస్సాం రాష్ట్రానికి చెందిన జిహిరుల్‌ రెహమాన్‌, అబీబ్‌గా గుర్తించారు. ఈ ఘటనపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేయడంతో.. అధికారుల్లో కదలిక వచ్చింది. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ఆటోనగర్‌లో యస్‌యల్ ఫార్మా కంపెనీని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, పారిశ్రామిక అధికారులు పరిశీలించి మూసివేశారు.

ఫార్మా ఫ్యాక్టరీకి పర్మిషన్‌ కూడా లేకపోవడంతో కంపెనీ యాజమాన్యంపై సీరియస్‌ అయ్యారు. అలాగే.. విషవాయువు విడుదలపై విచారణకు ఆదేశించారు ఆర్డీవో రవీంద్రరావు. ఎస్‌ఎల్‌ ల్యాబ్స్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఇచ్చామని, ఉత్పత్తులకు ఇంకా అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అనుమతులు లేకుండా కంపెనీలో ఉత్పత్తి ప్రారంభించడంపై విచారణ జరుపుతామని, అస్వస్థతకు గురైన కార్మికుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతామని తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో ఉత్పత్తిని నిలుపుదల చేయించామని, యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు ఎన్‌టిఆర్‌ కలెక్టర్‌ ఢిల్లీరావు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి