Anakapalle Pharma Blast: నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు.. 18కి చేరిన మృతుల సంఖ్య! ప్రమాదానికి అసలు కారణం ఇదే
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో సంభవించిన భారీ పేలుడు కర్మికుల జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు18 మంది మృత దేహాలను వెలికి తీశారు. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఏసెనిషియల్ ఫార్మా లో సాల్వెంట్ లీకై ఎలక్ట్రికల్ ప్యానల్ పై పడటంతో భారీ ప్రమాదం సంభవించింది..
అనకాపల్లి, ఆగస్టు 22: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో సంభవించిన భారీ పేలుడు కర్మికుల జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు18 మంది మృత దేహాలను వెలికి తీశారు. దాదాపు 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఏసెనిషియల్ ఫార్మా లో సాల్వెంట్ లీకై ఎలక్ట్రికల్ ప్యానల్ పై పడటంతో భారీ ప్రమాదం సంభవించింది. రియాక్టర్ నుంచి MTBE మిశ్రమం మార్చే సమయంలో లీక్ అయినట్లు తెలుస్తుంది. పైప్ లికేజితో ఆవిరి బయటకు వచ్చి కెమికల్ రియాక్షన్ జరిగింది. అనంతరం క్షణాల వ్యవధిలోనే మందుల తయారీలో ఉపయోగించే 500 కేఎల్ సామర్థ్యం గల రియాక్టర్ భారీ శబ్ధంతో పేలి మంటలు వ్యాపించాయి. ఏసీ యూనిట్లకు మంటలు అంటుకుని.. క్షణాల్లో వ్యాపించాయి. బ్లాక్ లో సిలింగ్, గోడలు కూలిపోయాయి.
పేలుడు దాటికి అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు. ఓ మహిళా కార్మికురాలి శరీరం చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే హృదయవిదారక దృశ్యం కనిపించింది. ఆమె పేగులు బయటకు వచ్చేసి భయానకంగా కనిపించింది. మంటల్లో కాలిపోయి చనిపోయినవారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకుని చనిపోయిన కార్మికులే ఎక్కువగా ఉన్నారు. కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి వెలికి తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సహాయం చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఫ్యాక్టరీస్ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు.
ఘటనా స్థలంలో లభించిన మృతదేహాలను కేజీహెచ్ మార్చురికి తరలించి, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 నుంచి 12.40 గంటల వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 1.25 నుంచి 1.45 గంటల వరకు ఘటన స్థలిని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు.