Andhra Pradesh: నేటికి 124 ఏళ్లు.. దేశంలోనే తొలి రైలు ప్రమాదం ఏపీలో ఎక్కడ జరిగిందో తెలుసా..?
సరిగ్గా 124 ఏళ్ల క్రితం.. చీకటి రాత్రిలో విరుచుకుపడిన పెను వరద భారత రైల్వే చరిత్రలోనే తొలి నెత్తుటి మరకను మిగిల్చింది. కడప జిల్లా మంగపట్నం వద్ద వంతెన కూలి మెయిల్ రైలు జలసమాధి అయిన ఆ ఘోర దుర్ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. శతాబ్ద కాలం దాటినా నాటి రైలు ప్రమాద ఆనవాళ్లు, థెరిసా లీమా సేవా పథం నేటి తరానికి గతాన్ని గుర్తుచేస్తూ.. మంగపట్నం గ్రామాన్ని చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిపాయి.

భారతదేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రైలు ప్రమాదానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది వైఎస్సార్ కడప జిల్లాలోని మంగపట్నం. నేటికి సరిగ్గా 124 ఏళ్ల క్రితం.. అంటే 1902 సెప్టెంబర్ 12న జరిగిన ఈ ఘోర దుర్ఘటన దేశ రైల్వే చరిత్రలోనే తొలి పెను విషాదంగా నమోదైంది. విషాదంతో పాటు ఓ మహోన్నత సేవా మూర్తి త్యాగానికి, ఆమె స్ఫూర్తితో వెలిసిన విద్యా కేంద్రాలకు ఈ ప్రాంతం నిలయంగా మారింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం, కొండాపురం మండల పరిధిలోని మంగపట్నం ప్రాంతం శతాబ్దానికి పైగా చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బ్రిటిష్ కాలంలో అప్పటి మద్రాస్-బాంబే ప్రధాన రైల్వే మార్గంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
వరద ధాటికి కొట్టుకుపోయిన వంతెన
ప్రమాదం జరిగిన సమయంలో కురిసిన కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆ వరద ఉధృతికి మంగపట్నం సమీపంలోని రైల్వే వంతెనలో కొంత భాగం ఒక్కసారిగా కొట్టుకుపోయింది. సరిగ్గా అదే సమయంలో వేగంగా వచ్చిన మద్రాస్-బాంబే మెయిల్ రైలు విరిగిన వంతెన వద్దకు చేరుకోవడంతో క్షణాల వ్యవధిలోనే బోగీలు వరద నీటిలోకి దూసుకెళ్లాయి. అధికారిక రికార్డుల ప్రకారం రైలులో మొత్తం 156 మంది ప్రయాణిస్తుండగా.. అందులో 71 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. 77 మంది ప్రాణాలతో బయటపడగా, మరో 8 మంది ఆచూకీ గల్లంతైంది. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో మృతదేహాలు కొట్టుకుపోయి, మృతుల గుర్తింపు ప్రక్రియ అత్యంత కష్టతరంగా మారింది.
విషాదంలో అమరత్వం పొందిన సేవామూర్తి
ఈ దుర్ఘటనలో భారతీయ మహిళా విద్య, పేదల సేవకు జీవితాన్ని ధారపోసిన ప్రముఖ సేవా మూర్తి థెరిసా ఆఫ్ సెయింట్ రోజ్ ఆఫ్ లిమా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.1858లో మద్రాస్‌లో జన్మించిన ఆమె, పేదలు, అనాథలు, అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేశారు. 1887లో కార్మెలైట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ థెరిసా సంస్థను స్థాపించి దక్షిణ భారతదేశంలో మహిళా సాధికారతకు, విద్యాభివృద్ధికి బలమైన పునాదులు వేశారు. ప్రమాదంలో ఆమె మరణించినప్పటికీ, ఆ ప్రాంతం ఆమె పవిత్ర సేవా జీవితంతో ముడిపడి ఉన్న పుణ్యక్షేత్రంగా మారింది.
విషాదం నుంచి విద్యా వికాసం
థెరిసా లీమా జ్ఞాపకార్థం, ఆమె అందించిన సేవా స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు మంగపట్నం పరిసరాల్లో సేవా సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేవలం విషాద జ్ఞాపకంగా మిగల్చకుండా, స్థానిక ప్రజల కోసం పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పారు. 2003లో ఆమె జ్ఞాపకార్థం మంగపట్నం సమీపంలో ప్రత్యేకంగా ఇంగ్లీష్ స్కూల్‌ను ప్రారంభించారు. దీంతో ఎందరో నిరుపేద గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. శతాబ్ద కాలం దాటినా నాటి రైలు ప్రమాద ఆనవాళ్లు, థెరిసా లీమా సేవా పథం నేటి తరానికి గతాన్ని గుర్తుచేస్తూ.. మంగపట్నం గ్రామాన్ని చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిపాయి.
