AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ మహిళలకు గుడ్‌ న్యూస్‌.. ఇక..ఏసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ

ఏపీ మహిళలకు గుడ్‌ న్యూస్‌.. ఇక..ఏసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ

Phani CH
|

Updated on: Sep 12, 2026 | 5:55 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అమలవుతున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని త్వరలో ఏసీ, లగ్జరీ బస్సులకు కూడా విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా రోడ్డెక్కనున్న ఏసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించనున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా కోట్లాది ఉచిత ప్రయాణాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రయాణ ఖర్చు తగ్గడంతో మహిళలకు ఆర్థికంగా ఊరట కలగడంతోపాటు ఉద్యోగాలు, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం పెరిగిందని అధికారులు పేర్కొన్నారు.

ఏపీలోని కూటమి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో మాత్రమే అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలో ఏసీ బస్సుల్లో కూడా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు చల్లటి ఏసీ బస్సులలో హాయిగా, గౌరవప్రదంగా ప్రయాణించాలనేదే తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ సాధారణ బస్సుల్లో, పల్లెవెలుగుల్లో, ఎక్స్‌ప్రెస్‌లలో మాత్రమే ఫ్రీ జర్నీ సౌకర్యం ఉందనే విషయం తెలిసిందే. అయితే, ఇకపై ఎండలకు ఇబ్బంది పడుతూ ప్రయాణించే అక్కచెల్లెమ్మలకు కూటమి ప్రభుత్వం మరింత ఊరటనిస్తూ ఈ బిగ్ డిసిషన్ తీసుకుంది. ఇకపై మన రాష్ట్రంలో తిరిగే లగ్జరీ ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేయాలని కూటమి సర్కారు నిర్ణయించింది. మహిళా సాధికారత అనేది కేవలం మాటల్లో చెప్పేది కాదని, చేతల్లో చూపించి నిరూపిస్తున్నామని చెప్పడానికి ఇదో చక్కటి నిదర్శనమని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు త్వరలోనే పెద్ద సంఖ్యలో సరికొత్త ఏసీ బస్సులను రోడ్లపైకి తీసుకురాబోతున్నారు. ఆ కొత్త ఏసీ బస్సుల్లో కూడా మహిళలందరికీ ఎలాంటి టికెట్ ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించే అద్భుతమైన అవకాశం లభించనుంది. అక్కచెల్లెమ్మలు తమ పుట్టింటికి వెళ్లాలన్నా, దేవుడి దర్శనాలకు వెళ్లాలన్నా, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు చేయాలన్నా ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఉచిత బస్సులో ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు కాబట్టి..పల్లె ప్రాంతాల నుంచి పెద్దాసుపత్రులకు వస్తున్న మహిళా రోగుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఓపీకి వస్తున్న మహిళా రోగుల సంఖ్య పెరగడమే ఇందుకు నిదర్శనమంటున్నారు అధికారులు. ఇక నెలవారీ పరీక్షలకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. గతంలో ఊళ్లలో ఉన్న ఆర్ఎంపీలను ఆశ్రయించే మహిళలు.. ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రులకు రావడం వెనక అసలు కారణం.. ఉచిత బస్సు పథకమేనంటున్నారు వైద్యాధికారులు. గతేడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం వలన ఏపీలోని మహిళల ఆర్థిక సాధికారత పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. తొలి రోజు నుంచి 2026 ఆగస్టు నాటికి 87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయి. అంటే రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ‘స్త్రీ శక్తి’ కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం రోజుకు సగటున రూ.8.53 కోట్ల సబ్సిడీ భరిస్తోంది. ఇప్పటి వరకు రూ.3,095 కోట్లు ఖర్చు చేసింది. 2026-27 బడ్జెట్‌లో కూడా ఈ పథకం కొనసాగింపు కోసం రూ.1,420 కోట్లు కేటాయించారు. ఆర్టీసీలో మొత్తం 9,978 బస్సులున్నాయి. వీటిలో 7, 631 బస్సుల్లో స్త్రీ శక్తి అమలవుతోంది. స్త్రీ శక్తి ప్రారంభానికి ముందు ఆర్టీసీ ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతం మాత్రమే ఉంది. ఈ స్కీమ్‌ వచ్చిన తర్వాత అది 62 శాతానికి పెరిగింది. ఈ పథకం వలన రోడ్డు ప్రమాదాల్లో గాయపడే మహిళల సంఖ్య తగ్గడంతో బాటు మహిళలు ద్విచక్ర వాహనాలు, ఇతర వ్యక్తిగత రవాణా సాధనాలపై ఆధారపడటం తగ్గిందని ఆర్టీసీ చెబుతోంది. రోజువారీ ప్రయాణ భారం తగ్గడంతో మహిళలు ఆ డబ్బును కుటుంబ అవసరాలకు, పిల్లల నాణ్యమైన ఆహారం, చదువులకు వాడుకోగలుగుతున్నారు. అలాగే, ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు ప్రయాణం ఉచితం కావడంతో పనికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ప్రయాణ ఖర్చు లేకపోవడంతో బంధువుల ఇళ్లలో కష్టమైనా, శుభకార్యమైనా మహిళలు హాజరు కాగలుగుతున్నారు. ఏపీలోని ప్రధాన పుణ్య క్షేత్రాలకు వెళ్లే మహిళల సంఖ్య కూడా ఈ ఏడాది కాలంలో భారీగా పెరిగింది. ఉచిత ప్రయాణం స్కీమ్‌ పట్టణ, నగర ప్రాంతాల్లో వర్కింగ్ విమెన్‌కు బాగా ఉపయోగపడుతోంది. గతంలో బీటెక్, ఫార్మా వంటి కాలేజీలకు విద్యాసంస్థల బస్సుల్లో వెళ్లే విద్యార్థినులు.. ఇప్పుడు ఫ్రీ బస్ సదుపాయం రావడంతో వేలాది రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. ఈ ఉచిత ఫ్రీ బస్ పథకాన్ని కేవలం ఉచిత బస్సు ప్రయాణంగానే చూడటం సరైనది కాదు. మహిళల ఆర్థిక స్వావలంబన, సామాజిక చైతన్యం, స్వేచ్ఛాయుత సంచారానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తోందని చెప్పవచ్చు. వారి హక్కులను కాపాడటంతోపాటు, వారి సామర్థ్యాన్ని గుర్తించి మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ పథకాన్ని చూడాలి. ప్రతి ఇంటి మహాలక్ష్మి ఎవరిమీదా ఆధారపడకుండా తమ గమ్యాలను చేరుకోవడానికి అవకాశం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇలా.. ఈ పథకం వల్ల పలు రంగాలలో మహిళల భాగస్వామ్యం విస్తరింస్తోందని సామాజిక వేత్తలు చెబుతున్నారు. దక్షిణాదిలో ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది కర్ణాటకలోని ‘శక్తి’ పథకం. 2023లో ప్రారంభమైన ఈ పథకం సక్సెస్ కావడంతో.. తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ‘మహాలక్ష్మి’ పథకం పేరుతో మహిళలకు ఫ్రీ బస్ జర్నీని అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు.. ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈ పథకం అమలు చేస్తోంది. ఇటీవల తమిళనాడులో 2026 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ‘వెట్రి పయనం’ పథకాన్ని విజయ్ ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వం అప్పటికే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా, విజయ్ తన హామీతో దాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించి..గెలిచాక అమల్లోకి తెచ్చారు. కేరళలోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ తమ మ్యానిఫెస్టోలో ‘ఇందిరా గ్యారెంటీ’ పేరుతో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని చేర్చి… అమలుకూ శ్రీకారం చుట్టింది. మొత్తంగా ఈ పథకం.. మహిళలకే గాక.. దక్షిణాదిలోని రాజకీయ పక్షాలకూ ఫేవరెట్ పథకంగా మారింది. రాష్ట్ర మహిళలు తల ఎత్తుకునేలా ఈ సరికొత్త ఏసీ బస్సుల ఉచిత ప్రయాణ పథకం త్వరలోనే అమలుకాబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని అక్కచెల్లెమ్మలందరూ సద్వినియోగం చేసుకుని, సురక్షితంగా, సంతోషంగా ప్రయాణాలు సాగించాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లలకే కాదు.. పెద్దలకూ ఈ టీకాలు చాలా అవసరం

పుట్టగానే పాస్‌పోర్ట్‌.. ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..

Bigg Boss 10 Telugu News: బిగ్ బాస్‌ 10 – కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్‌

మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?

 

Follow Us