America: చైనా కుట్రేనా..? అలస్కా గగనతలంలో కనిపించిన మరో వస్తువు.. కూల్చేసిన అగ్రరాజ్యం..
అగ్రరాజ్యం అమెరికాలో చైనా స్పై బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. పలు దేశాల సైనిక రహస్యాలను సేకరించేందుకు చైనా ఇలాంటి స్పై బెలూన్ లను ఉపయోగిస్తుందని పేర్కొన్న అమెరికా దానిని కూల్చివేసింది.
అగ్రరాజ్యం అమెరికాలో చైనా స్పై బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. పలు దేశాల సైనిక రహస్యాలను సేకరించేందుకు చైనా ఇలాంటి స్పై బెలూన్ లను ఉపయోగిస్తుందని పేర్కొన్న అమెరికా దానిని కూల్చివేసింది. నిఘా సమాచారం సేకరించే సామర్థ్యం ఈ బెలూన్ కు ఉందని పేర్కొన్న అమెరికా తమ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని డ్రాగన్ కంట్రీని హెచ్చరించింది. దాదాపు వారం నుంచి అమెరికా.. చైనా మధ్య మటాల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా.. అలస్కా గగనతలంలో కారు లాంటి వస్తువును కనుగొనడం మరింత ఆజ్యం పోసినట్లయింది. బీజింగ్‌తో దౌత్యపరమైన విభేదాలు, చైనా గూఢచారి బెలూన్‌ను కూల్చివేసిన ఆరు రోజులకు శుక్రవారం నాడు అలాస్కా గగనతలంలో కనిపించిన గుర్తుతెలియని వస్తువును అమెరికా ఫైటర్ జెట్ కూల్చివేసింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటనను విడుదల చేసింది. ఇది ముప్పేనంటూ తెలిపింది.
వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. కొత్త వస్తువు ఉద్దేశ్యం లేదా మూలం ఏమిటో అస్పష్టంగా ఉంది. అయితే 40,000 అడుగుల ఎత్తులో తేలుతూ కనిపించిన ఈ వస్తువు.. పౌర విమానయానానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున దానిని కూల్చినట్లు చెప్పారు. అధ్యక్షుడు జోబైడెన్ ఆ వస్తువును కూల్చాలని మిలిటరీని ఆదేశించినట్లు కిర్బీ చెప్పారు.
ఈ సంఘటన గురించి వైట్‌హౌస్‌లో విలేకరులు జో బైడెన్ ను ప్రశ్నించగా.. షూట్ డౌన్ “విజయవంతం” అంటూ బిడెన్ అన్నారు.
గత శనివారం అమెరికాలోని అట్లాంటిక్ తీరంలో కనిపించిన చైనాకు చెందిన భారీ బెలూన్ కంటే ఈ వస్తువు చాలా చిన్నదని, దానిని యుఎస్ ఫైటర్ జెట్ కూల్చివేసిందని కిర్బీ చెప్పారు. ఇది సుమారు చిన్న కారు పరిమాణంలో ఉందని పేర్కొన్నారు.
ఇది ఎవరికి సంబంధించినది.. అనేది తెలియదని.. దాని ప్రయోజనం కూడా తమకు అర్థం కాలేదని తెలిపారు. దీని గురించి పరిశోధనలు కొనసాగుతున్నాయని పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు.
కాగా.. ప్రపంచవ్యాప్తంగా గూఢచారాన్ని సేకరించేందుకు చైనా నిఘా బెలూన్‌లను ఉపయోగిస్తుందని అమెరికా పేర్కొంది. ఈ మేరకు 40 దేశాలతో ప్రతినిధులతో US అధికారులు సమాచారాన్ని కూడా పంచుకున్నారు. డ్రాగన్ కంట్రీతో జాగ్రత్త ఉండాలని.. ఇలాంటి బెలూన్ లతో ముప్పు ఉందని పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..